బీజేపీ ఏపీ అధ్యక్షుడు సారా వీర్రాజు వైసీపీపై మత కుల ముద్ర వేయాలని చూస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సోము వీర్రాజు కార్పొరేటర్ గా కూడా పనికి రాని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని, అయితే కుల మత పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు.
నాడు చంద్రబాబు 40 దేవాలయాలు కూలిస్తే మీరు ఏం చేశారని వెల్లంపల్లి బీజేపీ నేతలను ప్రశ్నించారు. సారా వీర్రాజు దేశ భక్తుడా? లేక తెలుగుదేశానికి భక్తుడా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడు పోయారని, గుడులు కూల్చినప్పుడు మీ హిందూ ప్రేమ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీతో కలిసి ప్రభుత్వం పంచుకుంటూ గుడులు కూల్చిన ఘనత బీజేపిదే అన్నారు. సీఎం రమేష్, సుజనాచౌదరి బాబు బినామీలుగా ఉండి, జగన్ ని విమర్శిస్తున్నారని అన్నారు.
మీరు గుడులు కూల్చితే జగన్ నిర్మిస్తున్నారు... హిందూ ముసుగులో మత రాజకీయాలు చేస్తే సహించం, రాష్ట్రానికి చీడ పురుగులు సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనాచౌదరి అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మీరు కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా? ఏపీలో మాత్రం మతాల మధ్య గొడవలు పెట్టేందుకు వస్తున్నారు. క్యాసినో గోవాలో జరుగుతోంది. దాన్ని బ్యాన్ చేయమని ఆ రాష్ట్రంలో ఎందుకు డిమాండ్ చేయరు? రాష్ట్రానికొక డిమాండ్ బీజేపి చేయటం ఏంటి? తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలతో సహా స్థానిక ఎన్నికలన్నిటిలోనూ ఓటమి చెందారు. ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోరు. అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టటానికి చూస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఈ రాష్ట్రానికి కరోనా లాంటి వ్యక్తి అని, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన అని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. గుడివాడలో ఏం జరిగిందని నిజ నిర్దారణ కమిటీని వేశారు? కొడాలి నాని చేసిన సవాల్ ని దమ్ముంటే స్వీకరించాలని వెల్లంపల్లి అన్నారు.