Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రాలోనూ తెరాస అన్న కేసీయార్... రెండు రాష్ట్రాల్ని క‌లిపేయ‌మ‌న్నపేర్ని

Advertiesment
minister perni nani
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (14:06 IST)
ఆంధ్రాలోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని తెరాస ప్లీనరీ సందర్భంగా తెరాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఇవాళ ఏపీ మంత్రి పేర్నినాని స్పందించగా, కేసీఆర్‌, పేర్ని వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయవర్గాల్లో మరింత చర్చకు దారితీసింది.
 
సీఎం కేసీఆర్‌ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని ట్విటర్‌ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెరాస ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షం కావడం.. కేసీఆర్‌, జగన్‌ ఉమ్మడి కుట్రకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన చేయడం ఆ కుట్రలో భాగమని విమర్శించారు. వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ జోలికి రావొద్దని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.
 
 
‘‘తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని.. పాలన చేత కాదని, భూముల ధరలన్నీ పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. ఏడేళ్ల పాలనలో ఆ అపోహలన్నీ పటాపంచలు చేశాం. ఎఫ్‌సీఐ కూడా కొనలేమని చెప్పే స్థాయిలో వరి పండించాం. ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచాం. గతంలో ఉపాధికోసం పాలమూరు నుంచి ముంబయి వలస వెళ్లేవారు. ఇప్పుడు పాలమూరుకి వస్తున్నారు. దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయి.

ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాందేడ్‌, రాయచూర్‌ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయి’’ అని కేసీఆర్‌ వివరించారు.
 
 
ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్నినాని కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని సీఎం జగన్ గతంలోనే కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదే కదా’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 


కేసీఆర్‌.. ఏపీలో పార్టీ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం మీడియాతో అన్నారు. రాజకీయ పార్టీని ఎవరైనా ఎక్కడైనా పెట్టొచ్చని.. దానికి ఎవరి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరైనా రావచ్చని, ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉండి ఉంటే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేదని సజ్జల అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్ బుక్ మారి... మోటాగా కొత్త ఫేస్!