Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు హయాంలో ఏవోబీ అంతటా తులసి మొక్కలు ఉన్నాయా..?: మంత్రి బొత్స

చంద్రబాబు హయాంలో ఏవోబీ అంతటా తులసి మొక్కలు ఉన్నాయా..?: మంత్రి బొత్స
, శుక్రవారం, 5 నవంబరు 2021 (19:17 IST)
అన్నం పెట్టే రైతులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ బకాయిల అంశంలో చెరుకు రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారంటూ వారు ఆరోపణలు చేయడం సమంజసం కాదు అన్నారు.

రైతులపై అసలు లాఠీ ఛార్జే జరగలేదని స్పష్టం చేశారు. రైతులు కానివాళ్ళు కొంతమంది, రైతు ఆందోళనలో చొరబడి, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారని అన్నారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని, రైతుకి న్యాయం చేసేందుకు ఈ ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుందన్నారు. చెరుకు రైతుల రాస్తారోకో సందర్భంగా, కొంతమంది దుండగులు రాళ్ళు విసిరితే.. పోలీసులకు దెబ్బలు తగిలినా, వారు సంయమనంతో వ్యవహరించారని గుర్తు చేశారు. 

ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ నుంచి రైతులకు రావాల్సిన బకాయిలను అణాపైసలతో సహా చెల్లించేలా, రైతుకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైవేటు ఫ్యాక్టరీ అయినా.. చెరుకు రైతులకు బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. వాస్తవానికి 2015 నుంచే చెరుకు రైతులకు ఆ ఫ్యాక్టరీ బకాయిలు పడిందని, 2019లో తాము అధికారంలోకి వచ్చే సమయానికి కూడా రూ. 27 కోట్ల  బకాయిలు ఉన్నాయని మంత్రి బొత్స గుర్తు చేశారు. 
 
అలానే స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు..  చేతగాని వాళ్ళు మాట్లాడే మాటల్లా ఉన్నాయని అన్నారు. అమరావతి రాజధాని రైతుల యాత్రను టీడీపీ వాళ్ళు చేస్తోన్న, టీడీపీనే నడిపిస్తున్న యాత్ర అని మంత్రి బొత్స అన్నారు. అమరావతి రైతులకు ఈ ప్రభుత్వం ఏం నష్టం చేసిందని ప్రశ్నించారు. వారికి హామీ ఇచ్చినట్టుగానే.. పెన్షన్లు, కౌలు అన్నీ చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రానికి టీడీపీ వినాశికారిగా తయారైంది బొత్స ధ్వజమెత్తారు. 
 
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే
 
1- NCS ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి చెరుకు బకాయిలను చెల్లించాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. రైతులు రాస్తారోకో చేయడం అనేది తప్పుకాదు. వారి ఆవేదనను అర్థం చేసుకున్నాం. ఈ సమస్య ఇప్పటిది కాదు. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం 2015 నుంచి బకాయిలు చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్యను 2019లో వైయస్సార్‌ సీపీ అధికారంలోకివ వచ్చాక రూ.27 కోట్లు బకాయిలు ఉంటే.. వాటన్నింటిని రెవెన్యూ యాక్ట్‌ ద్వారా 60 ఎకరాలు అమ్మి...రైతుల బకాయిలను అణాపైసలతో సహా తీర్చడం జరిగింది.

- ఆరోజే మేము చెప్పాం.  ప్రైవేటు ఫ్యాక్టరీ యాజమాన్యం కాబట్టి,  లాభార్జనే ధ్యేయంగా ఉంటుంది. యాజమాన్యంతో అప్రమత్తంగా ఉండాలని, రైతులు అర్థం చేసుకుని ప్రత్యమ్నాయం ఏర్పాట్లు చేసుకోవాలని ఆనాడే  రైతులను అప్రమత్తం చేయడం జరిగింది. మా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయడం,  ప్రభుత్వానికి ఉన్న చట్ట పరిధి మేరకు క్రషింగ్‌ అనంతరం వచ్చే పంచదార మీద కస్టోడియన్‌ అధికారాన్ని ఇచ్చాం.

- ఆ నేపథ్యంలో సుమారు రూ.10కోట్లు విలువైన 30వేల బస్తాల పంచదారను సీజ్‌ చేయడం జరిగింది. రైతులకు ఇంకా రూ.16వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని యాజమాన్యం రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. యాజమాన్యానికి ఉన్న 19 ఎకరాలను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేయడం ద్వారా వచ్చే నగదును రైతులకు బకాయిలు చెల్లించేలా జిల్లా కలెక్టర్‌, జేసీ చర్చలు జరుపుతున్నారు. అది కాకుండా ఇంకా అయిదు ఎకరాలు యాజమాన్యానికి సంబంధించిన వర్కర్స్‌ క్వార్టర్స్‌ ఉంది. దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్‌ చేయమని కోరాం. మొత్తం 24 ఎకరాలును స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చే నగదును రైతుల బకాయిలు తీర్చేందుకు యత్నిస్తాం.
 
2- అయితే దురదృష్టకరమైన అంశం ఏంటంటే.. తమ స్వలాభం కోసం రెచ్చగొట్టే కొన్ని పార్టీల మాటలను  నమ్మవద్దని  రైతులను కోరుతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడే రాజకీయ పార్టీలను నమ్మవద్దని కోరుతున్నాం. మాది రైతు ప్రభుత్వం. రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతుకు మేలు జరిగే కార్యక్రమాన్నే మా ప్రభుత్వం చేస్తుంది. 

- ఎప్పుడూ లేనివిధంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. దెబ్బలు తిన్నా.. పోలీసులు సంయమనం పాటిస్తూ రైతులతో చర్చలు జరిపారు. కమ్యూనిస్ట్‌ పార్టీలవారు, అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ప్రోద్భలంతో ఆందోళనలు చేపట్టారు. రైతుల ఆవేదనను మేము అర్థం చేసుకుంటాం. అయితే విపక్షాలు ఏదోవిధంగా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ప్రజల్లో ఆందోళనలు సృష్టించి, హింసను ప్రేరేపించి, శాంతిభద్రతలు విఘాతం కలిగించేలా చేస్తున్న కుట్ర సాగదని చెబుతున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. ప్రతిపక్షాల కుట్రలను రైతులు అర్థం చేసుకోవాలి.
 
3- చెరుకు రైతులకు రావాల్సిన రూ.16కోట్ల బకాయిలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు రైతులపై లాఠీఛార్జ్‌ జరిగిందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ లాఠీఛార్జ్‌ జరిగిందో జిల్లాకు చెందిన పాత్రికేయులే చెప్పాలి. రైతులపై లాఠీఛార్జ్‌ జరిగిందని ఏ నాయకులు అన్నాడో.. వారికి అసలు అరెస్ట్‌లకు, లాఠీ ఛార్జ్‌కు అర్థం తెలుసా? పైగా కేసులు  పెట్టింది కూడా రైతులపై కాదు, ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలని చూశారో వారిపైన కేసులు పెట్టారు. 

- మేం రైతులతో కలిసి మెలిసి తిరిగే వాళ్లం. మా ప్రభుత్వానికి రైతుల కష్టం, సుఖం తెలుసు. విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సమస్య పేరిట విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. రైతుల బకాయిలు నూటికి నూరు శాతం చెల్లించాల్సిందే. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెబుతున్నాం.

- ప్రస్తుతం సాగు అవుతున్న చెరుకు పంట ఎవరికి అమ్మాలి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం అనేది మా ముందు ఉన్న అతి పెద్ద సవాల్‌. ఓవైపు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు చెరుకు రైతులు నష్టపోకుండా ఉండేలా కార్యక్రమం చేపట్టబోతున్నాం.
 
4- 2019 కి ముందే, మేం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం సుమారు రూ.27కోట్లు బకాయిలు ఉంటే.. దీనిపై అప్పట్లో మేము కూడా పోరాడాం. చర్చలు జరిపాం. అందుకే అధికారంలోకి వచ్చాక ఆ బకాయిల సమస్యను పరిష్కరించడం జరిగింది. యాజమాన్యం మాత్రం నష్టాలు వచ్చాయంటూ.. రైతులకు బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తుంది, దాన్ని నమ్మేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.

- రైతు కష్టార్జితాన్ని వారికి అందించేందుకు చర్యలు చేపట్టడంలో మా ప్రభుత్వం ముందు ఉంటుంది. షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయివేట్‌ది అయినా.. సమస్య నుంచి తప్పించుకునేందుకు, పారిపోయేందుకు తెలుగుదేశం పార్టీలాంటిది కాదు మా ప్రభుత్వం. శాంతియుతంగా ఉండే విజయనగరం జిల్లాలో ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరించడం చూస్తుంటే జిల్లావాసిగా సిగ్గుపడాల్సి వస్తోంది.
 
5- సినిమా యాక్టర్‌ పార్టీ వాళ్లు ఏకంగా రేపు జరిగే ధర్నాకు రావాలని,  బిర్యానీ ప్యాకెట్టు ఇస్తామంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. మరి వారిపై ఏం చర్యలు తీసుకోవాలో చెప్పండి.  ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ పార్టీ నాయకుడు అయినా ఆలోచించాలి. రూ.90 కోట్లు అప్పుంది, ధర్నా చేస్తామంటున్న పవన్‌ కల్యాణ్‌... రైతులను రెచ్చగొట్టడం కాకుండా, వారి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రవర్తిస్తే బాగుంటుంది. 

- చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల బకాయిల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు. రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలపై అడిగే హక్కు ఉంటుంది. అయితే ఆ సమస్యపై ప్రభుత్వం స్పందించిందా లేదా అనేదాని గురించి కూడా ఆలోచన చేయాలి కదా?

-  రైతులకు చెల్లించాల్సిన ప్రతిపైసాను వారికి చెల్లించేలా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. జిల్లా యంత్రాంగం అంతా అదే పనిలో ఉంది. బకాయిలకు సంబంధించిన సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాం. 
 
6- రాబోయే రోజుల్లో 80వేల చెరుకు టన్నుల పంటను ఏవిధంగా డిస్పోజ్‌ చేయాలి, రైతులను ఏవిధంగా ఆదుకోవాలనే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దీన్ని రైతులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. త్వరలోనే బాధిత రైతులతో సమావేశం అవుతాం. భీమ్‌ సింగ్‌ షుగర్స్‌ను తెరిపించే విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్న మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..  ఫ్యాక్టరీని నడిపించాలంటే 90వేల టన్నుల చెరుకు ఉండాలి. 15వేల టన్నులతో ఫ్యాక్టరీని ఎలా తెరిపిస్తారు. రైతులు దానికి తగ్గట్టు చెరుకు పంటను పండిస్తామని హామీ ఇస్తే తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫ్యాక్టరీని తెరిపించాలంటున్న రైతులు వస్తే .. వారితో మేము మాట్లాడతాం. ఒకరో ఇద్దరో చెబితే ఫ్యాక్టరీని తెరిపించలేం కదా.
 
7- చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, వామపక్షాలు అన్నీ కలిసి.. తామేదో రైతులపై కేసులు పెట్టి, అణగదొక్కాలని చూస్తున్నాం అన్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు, అయితే రైతుల ధర్నాలో పాల్గొన్న కృష్ణమూర్తి, కోరాడ ఈశ్వరరావు, వెంకటరమణ రైతులు కాదు కదా? వారికి బకాయిలు లేవు కాదా? సమస్యలపై ఉద్యమాలు చేయడం తప్పుకాదు, కానీ సంయమనం పాటించాలి కదా? పోలీసులపై రాళ్లతో దాడి చేయడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదు. 
 
8- రైతులను ముందుపెట్టి, కొన్ని దుష్టశక్తులు, దుర్మార్గపు రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకం ఇది. దయచేసి రైతులను సోదరులుగా చూద్దాం. అన్నంపెట్టే రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలుచేస్తే దేవుడు కూడా క్షమించరు. వాస్తవాలు తెలుసుకుని, దానికి సంబంధించిన పరిజ్ఞానంతో వస్తే ప్రభుత్వం సమాధానం చెబుతుంది.

- రైతులపై లాఠీఛార్జ్‌ జరిగిందంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఏవిధంగా మాట్లాడతారు? లేని దాన్ని సృష్టించడం తప్పు కాదా? బాధ్యతగల ప్రభుత్వం కాబట్టే సమస్యను పరిష్కరించేందుకు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి పంపింది. రైతులను రైతులుగా చూసి, ఎవరైనా, వారి సమస్యలను పరిష్కరించేలా చూడాలేగానీ, రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని కోరుతున్నాం. - దయచేసి ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లా వాతావరణాన్ని పాడు చేయవద్దని కోరుకుంటున్నాం.
 
చంద్రబాబు హయాంలో ఏవోబీ అంతటా తులసి మొక్కలు ఉన్నాయా..?
9- రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ లేదు, ఆంధ్రప్రదేశ్‌ గంజాయి వనంగా మారిపోతోందంటూ చంద్రబాబు నాయుడు నిన్న మీడియ సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. గంజాయి సమస్య ఇప్పుడు పుట్టింది కాదు.. అప్పటి టీడీపీ సర్కార్‌లో మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు మాట్లాడిన వీడియోను మీడియా ముందు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రదర్శించారు. 

- నేను నేరుగా ఒక  ప్రశ్న అడుగుతాను. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ఏవోబీ అంతటా తులసి మొక్కలు ఉన్నాయా..? నేను గంజాయి సాగును సమర్థించడం లేదు. కానీ, ఏవోబీ ప్రాంతంలో ప్రతి పంట పొలాన్ని వెళ్ళి చూసి గంజాయి ఎక్కడ సాగు చేస్తున్నారో దాన్ని తీసివేసే పరిస్థితి లేదు. ఒడిశా సరిహద్దుల్లో  ఈ సాగు జరుగుతూ ఉంటుంది.  ఈ విషయాన్ని మేం చెప్పటం కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా, సాక్షాత్తూ గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఇదే విషయం చెప్పారు. 

- ఆరోజు తన మంత్రులే ఏపీ నెంబరు 1 అని చెప్పినప్పుడు బాబు ఎందుకు సిగ్గు పడలేదు, అదీకాక, 1995 నుంచి 2021 వరకు ఈ 26 ఏళ్ళ కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయింది. చంద్రబాబు ఏకంగా సగానికి పైగా కాలం అంటే, ఏకంగా 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు.  ఈ 14 ఏళ్ళలో నువ్వు కట్టిన ప్రాజెక్టులు ఏమిటి అంటే... నోరెత్తడు.  ఈ 14 ఏళ్ళలో నీ పేరు చెబితే ఏ సంక్షేమ పథకం గుర్తుకు వస్తుందంటే.. మాట్లాడడు.  ఈ 14 ఏళ్ళలో గంజాయి సాగు ఇబ్బడి ముబ్బడిగా మీ చేతగానితనం వల్లే పెరిగింది కదా అంటే.. మాట్లాడడు. 

- మేం అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా.. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంటు వ్యవస్థను పెట్టి, రైతు భరోసా లాంటివి గిరిజన రైతులకు కూడా ఇచ్చి, గంజాయి సాగును ఆంధ్ర రైతుల వరకు ఏ ఒక్కరూ చేయకుండా అడ్డుకుంటున్నది. అలాగే, పోలీసు దాడులు  కూడా గత రెండున్నరేళ్ళుగానే, గతంలో ఏరోజూ లేనంతగా జరిగిన విషయం కూడా, గతంతో పోలిస్తే భారీగా గంజాయిని ఎక్కడికక్కడ పట్టుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. 
 
ఆరోజు గౌతమ్ సవాంగ్... ఈరోజు గౌతమ్ సవాంగ్ ఒక్కరే..
10- చంద్రబాబు నాయుడు హయాంలో గౌతమ్‌ సవాంగ్‌ విజయవాడ సీపీగా పనిచేశారు కదా? ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆయన కూడా మన రాష్ట్రం వాడు కాదు.  ఆయన ఒక ఎస్టీ. అటువంటి అధికారిని పట్టుకుని దాదాపుగా రోజూ చంద్రబాబు ఆడిపోసుకుంటున్నాడంటే.. అందుకు కూడా కారణం ఫ్రస్ట్రేషన్. ఇదే డీజీపీ  బాబు హయాంలో విజయవాడ నగర కమిషనర్ గా పనిచేయలేదా..?

11- వైయస్సార్‌ సీపీ నేతలు, పోలీసులు కలిసి నామినేషన్లు వేయడంలో అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు అర్థరహితం. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, చేతకానివాళ్ళు చేసే విధంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. 

- ఇక అధికారుల్ని బెదిరిస్తూ నిన్న మాట్లాడారు, చివరికి ఒక మున్సిపల్ కమిషనర్ ను కూడా బెదిరించే స్థాయికి బాబు దిగజారాడు. తాము ఏ ఒక్కరినీ వదిలిపెట్టం అంటూ మరోసారి బెదిరించాడు. వెంటాడుతాం.. వేటాడుతాం.. అనే పదాలు కూడా వాడాడు. అంటే బాబు పార్టీ ఎన్నికల ప్రక్రియను వదిలేసి, ఎన్నికల్లో పోటీ నుంచి పారిపోయి, కత్తులు, తుపాకుల పార్టీగా మారాలనుకుంటోందా అన్నది చెప్పాలి. 

- ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్ అంటూ ఏదేదో మాట్లాడారు. 2019 ఎమ్మెల్యే ఎన్నికలు, 2019 ఎంపీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు.. అన్నింట్లోనూ ప్రజలు తిరగబడి చంద్రబాబు బట్టలే విప్పారు కదా. అయినా, ఏరోజూ తన కుట్ర, కుతంత్రపు రాజకీయాన్ని ఆయన మానుకోలేదు కదా.. ?

- దీపావళి అమవాస్య రోజున రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి దీపావళి పండుగ అయితే, ఒక్క చంద్రబాబుకీ, ఆయన అనుచరులకు మాత్రం అమావాస్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ఉంది. 

- కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే చంద్రబాబు చేతులెత్తేశారు. కాబట్టే, సంయమనం కోల్పోయి నిరాశ, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. 

- సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తానంటే జనం రావటం లేదని, జిల్లా మొత్తం నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా డబ్బులిచ్చి మరీ సభలకు జనాన్ని తీసుకొచ్చాడంటే,  చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే. 

- ఈ విషయం అర్థమైంది కాబట్టే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, డీజీపీ మీద, చివరికి ఎలక్షన్ కమిషనర్ మీద కూడా నోరు పారేసుకుంటున్నాడు. 

- ఎన్నికల గడువు ఎవరికైనా ఒక్కటే ఉంటుంది. అమవాస్య నాడు కాకపోతే మరునాడు, ముందురోజు కూడా నామినేషన్ వేసుకునే అవకాశం ఉంది. ఏ ఒక్కరూ ఎన్నికల కమిషన్ ను ఈ విషయంలో ప్రభావితం చేయలేరు. ఎన్నికల కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ అని నిమ్మగడ్డ రమేష్ ఉండగా వాదించిన చంద్రబాబు, ఈరోజు ఎన్నికల కమిషన్ ను తప్పుబడుతున్నాడంటే.. దాని అర్థమేమిటి..? ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర వ్యవస్థ. రమేష్ లాంటి వాళ్ళు ఉంటేనే అది గబ్బు పడుతుంది. నీలం సాహ్ని గారిది మన రాష్ట్రమూ కాదు, ఇక్కడున్న ఏ ఒక్కరి సామాజికవర్గమూ కాదు, కాబట్టి చంద్రబాబు అక్కసుతో చేస్తున్న ఆరోపణలు తప్ప వాటికి ఎలాంటి విలువా లేదు. 
 
12- ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు కొన్ని పాలసీలు ఉంటాయి. వాటి ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తాయి. వాటిని కూడా విమర్శిస్తే ఎలా? రాష్ట్రం అభివృద్ధి చెందకుండా తెలుగుదేశం పార్టీ అడుగడుగునా అడ్డుకుంటూ, రాష్ట్ర వినాశకారిగా టీడీపీ తయారైంది. తెల్లారి లేస్తే ప్రభుత్వంపై బురద చల్లడమే టీడీపీ పని. పనికిరాని 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎందుకు? 

- మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ.. అమరావతి రాజధాని  రైతుల పేరుతో టీడీపీనే యాత్రను చేస్తుంది, దానిని వెను ఉండి నడిపిస్తున్నది కూడా టీడీపీనే.  రాజధాని రైతులు కాదు... టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం ఏం నష్టం చేసిందని అని యాత్రలు చేస్తారు..?. ఒప్పందం ప్రకారం వారికి ఇవ్వాల్సిన కౌలు, పింఛన్లు అన్నీ ఇస్తున్నాం కదా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిహద్దు వెంట ఓ చిన్నపాటి విలేజ్‌ ఏర్పాటు