వారు అటవీ సంపదను కాపాడే బీట్ ఆఫీసర్లు. అలాంటి వారు ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్‌లో. అనంతపురం జిల్లా కదిరిలోని ఒక ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని, తన స్నేహితులతో కలిసి నిన్న రాత్రి మదనపల్లి సమీపంలోని హార్సిలీ హిల్స్‌కు వచ్చింది. స్నేహితులతో కలిసి రాత్రి గంగోత్రి గెస్ట్ హౌస్‌లో నిద్రించింది. ఉదయం స్నేహితులతో కలిసి చల్లటి ప్రాంతంలో తిరుగుతూ ఫోటోలను తీసుకుంటున్నారు.
ఇంతలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అక్కడకు వచ్చారు. ఎవరు మీరు.. మీరు చేసేదంతా వీడియో తీస్తున్నాం. మిమ్మల్ని పోలీసులకు అప్పజెబుతాం అంటూ విద్యార్థినులను బయపెట్టారు. దీంతో కొంతమంది యువకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఒక విద్యార్థినితో పాటు అతని స్నేహితుడు మాత్రం అక్కడే ఉన్నారు.
యువకుడ్ని చితకబాదిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మేము ఫారెస్ట్ అధికారులం పడుకో అంటూ ఆ యువతిని భయపెట్టారు. ఆమె భయంతో పరుగులు పెడుతుంటే వెంటాడి ఆమెపై మృగాళ్ళా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత యువతి తన స్నేహితుల వద్దకు వెళ్ళి విషయాన్ని తెలియజేసింది.
వెంటనే ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఇందులో ఒక నిందితుడు మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు బాబ్జీ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.