ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అపారనష్టం వాటిల్లింది. రైల్వే కట్టతో పాటు జాతీయ రహదారులు సైతం తెగిపోయాయి. దీంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో పడుగుపాడు రైల్వే స్టేషన్ వద్ద వరదనీటి ఉధృతికి రైల్వే కట్ట కొట్టుకునిపోయింది. దీంతో పట్టాలు గాల్లో వేడుతున్నాయి.
అలాగే, కోవూరు వద్ద చెన్నై - విజయవాడ జాతీయ రహదారి వరదనీటి ప్రవాహానికి తెగిపోయింది. దీంతో వాహనాలు కొన్ని కిలోమీటర్ల మేరకు ఆగిపోయాయి. ఈ కారణంగా నెల్లూరు - విజయవాడ మార్గంలో ప్రయాణించే అనేక రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఒక రైలు వేళలో మార్పు చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ ఆదివారం ఒక ప్రకటన జారీచేసింది.
రద్దు చేసిన రైళ్ళలో 22859 నంబరు కలిగిన పూరి -చెన్నై సెంటర్ల, పూరి - తిరుపతి (17489), చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్ (12656), చెన్నై - విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్ (12712), గౌహతి - బెంగుళూరు కంటోన్మెంట్ (12510), న్యూ తిన్‌సుకియా - తాంబరం (15930) రైళ్లు ఉన్నాయి.
అలాగే, బనస్వాడి - పాట్నా ఎక్స్‌ప్రెస్ (22354), హజరత్ నిజాముద్దీన్ - మదురై (12652), హజరత్ నిజాముద్దీన్ - ఎర్నాకులం (12646), న్యూఢిల్లీ - చెన్నై సెంట్రల్ (12616), న్యూఢిల్లీ - చెన్నై సెంట్రల్ (12622), కాచిగూడ - చెంగల్పట్టు (17652), సికింద్రాబాద్ - తిరువనంతపురం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (17230), యశ్వంత్‌పూర్ - హతియా (12836) అనే రైళ్లను రద్దు చేశారు. కానీ, ధన్‌బాద్ - అలెప్పీ ఎక్స్‌ప్రెస్ మాత్రం కొన్ని గంటల పాటు ఆలస్యంగా నడుస్తోంది.
అయితే, 12434 అనే నంబరు కలిగిన హజరత్ నిజాముద్దీన్ - చెన్నై సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరు - నంద్యాల్ - ధర్మవరం - పాకాల - కాట్పాడి మీదుగా దారి మళ్లించారు. అలాగే, హౌరా - చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు, జీటీ ఎక్స్‌ప్రెస్, సంత్రాగచ్చి - చెన్నై సెంట్రల్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హౌరా - యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా దారి మళ్లించారు. వీటితో పాటు భువనేశ్వర్ - బెంగుళూరు, హౌరా - ఎర్నాకుళం, జైపూర్ - చెన్నై సెంట్రల్, హజరత్ నిజాముద్దీన్ - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైళ్లు దారి మళ్లించిన జాబితాలో ఉన్నాయి.