మూఢనమ్మకాలతో రెండు రోజుల క్రితం తమ ఇద్దరు కూతుళ్లను చంపుకున్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన తల్లిదండ్రులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తండ్రి పురుషోత్తంనాయుడు ఎ1గా, తల్లి పద్మజ ఎ2గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితులను మదనపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం శివనగర్‌లో నివాసం ఉండే పురుషోతంనాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి తమ ఇద్దరు కూతుళ్లు అయిన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను మూఢనమ్మకాల పేరుతో హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఇద్దర్ని అరెస్ట్ చేస్తున్న సమయంలో తల్లి పద్మజ వింతగా ప్రవర్తించారు. చేతుల్ని తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అంతేకాదు ఇంట్లో పోలీసులతో ఆమె గొడవపడింది. ఈ రోజు అవకాశం ఇవ్వండి అంటూ వేడుకుంది. రేపటిలోగా ఇద్దరు బిడ్డలు బ్రతికి వస్తారంటూ పిచ్చి, పిచ్చిగా మాట్లాడింది. పూజ గదిలోకి బూట్ల తో వెళ్ల వద్దంటూ వాదనకు దిగింది. కూతుళ్లను దారుణంగా హత్య చేశామనే పశ్చాత్తాపం కూడా కనిపించలేదు.
పురుషోత్తం నాయుడులో కాస్త బాధ కనిపించినా.. ఆమె మాత్రం దర్జాగా వెళ్లి పోలీసుల వాహనంలోకి వెళ్లి కూర్చుంది. కరోనా టెస్టుకు తల్లి పద్మజ సహకరించలేదు.. కరోనా శివుడి నుంచి వచ్చిందని.. శివుడికి కరోనా టెస్ట్ ఏంటని పిచ్చిగా మాట్లాడారు.. టెస్ట్ చేయించుకోనని చిందులు తొక్కారు. చెత్తన కడిగేయడానికి తన శరీరం నుంచి కరోనాను పంపించానూ అంటూ పెద్దగా అరిచారు.. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.