ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి వస్తువూ డోర్ డెలివరీ చేయబడుతోంది. మరీ ముఖ్యంగా ఆహారానికి కూడా హోటళ్లకు వెళ్లనవసరం లేకుండాపోయింది. మీ మొబైల్‌లో యాప్ ఉంటే చాలు. మీరు ఎక్కడ ఉంటే అక్కడకు ఆహారం నిమిషాల వ్యవధిలో వచ్చేస్తుంది.
దీంతో జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హోటళ్లలో కస్టమర్ల కంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు.
తాజాగా జొమాటో సంస్థ ఓ హోటల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్స్ క్యూలో నిల్చున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. ఇక్కడ నిలుచున్న వారు హైదరాబాద్‌లోని బావర్చి బిర్యానీ ఔట్‌లెట్ వద్ద హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్‌లు తీసుకువెళ్లేందుకు క్యూలైన్‌లో నిలుచున్నారని పేర్కొంది.
అంటే హైదరాబాద్ నగరంలో బిర్యానీకి ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ హోటల్‌లో బిర్యానీ కోసం రోజుకు 2000 ఆర్డర్‌లు వస్తున్నాయని జొమాటో సంస్థ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.