టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మళ్లీ ఈ నల 27వ తేదీ నుంచి పునఃప్రారంభంకానుంది. ఈ యాత్ర డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుంది. తొలుత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ సమయాభావం వల్ల విశాఖ వరకు మాత్రమే పూర్తి చేయనున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని సెప్టెంబరు 9న తేదీన ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇపుడు ఇక్కడ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.
రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్ర ముగిస్తారు.
కాగా, పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో మొదలైంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజుల్లో 4 వేల కి.మీ.లు పాదయాత్ర చేయాలన్నది మొదట అనుకున్న లక్ష్యం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు, జగన్ ప్రభుత్వ అరాచకాలు, కక్షసాధింపుపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకుల్ని కలిసి వివరించడం వంటి వ్యవహారాల్లో ఇన్నాళ్లూ తీరిక లేకుండా ఉన్నారు.
దీంతో రెండున్నర నెలలపాటు పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నికలు మరింత దగ్గరపడుతుండటంతో... ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించుకుని, విశాఖపట్నంలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంటు కూడా కలిసి వచ్చేలా లోకేశ్ విశాఖలో పాదయాత్ర ముగించే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనికి తగ్గట్టుగా రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.
పాదయాత్రకు విరామం ప్రకటించే నాటికి లోకేశ్ 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి అవరోధాలు సృష్టించేందుకు ప్రభుత్వం, వైకాపా అనేక ప్రయత్నాలు చేశాయి. చిత్తూరు జిల్లాలో ప్రచారరథంతో పాటు, లోకేశ్ నిలబడి మాట్లాడే స్టూలు, మైక్‌ను సైతం పోలీసులు లాక్కుని గొంతు నొక్కే ప్రయత్నం చేశారు.
కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది మొదలు తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కి.మీ.లకు ఒకటి చొప్పున పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. పాదయాత్రకు దాదాపు అన్ని చోట్లా మంచి స్పందన లభించింది. పాదయాత్ర సాగిన 84 నియోజకవర్గాల పరిధిలో 66 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, ముస్లింలు.. ఇలా వివిధ వర్గాలతో 11 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్రలో ఆయనకు 4 వేలకుపైగా వినతిపత్రాలు అందాయి.