ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైన్ షాపులు తెరుచుకున్నాయి. గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి మద్యం అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మందు బాబులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి మద్యం దుకాణాల వద్ద వేచి చూస్తున్నారు.
కానీ, పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో మాత్రం మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ, ఏపీలో మాత్రం సోమవారం ఉదయం 11 గంటలకే ఈ షాపులు తెరిచారు. ఇవి రాత్రి 7 గంటల వరకు తెరిచివుంచుతారు.
ఇప్పటికే షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. కంటైన్మెంట్ జోన్లలో మినహా అన్ని ప్రాంతాల్లోనూ మద్యం షాపులను ఏపీ ప్రభుత్వం తెరుస్తోంది. అయితే షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
ఒకసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపు వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. మాస్క్ లేకపోతే అనుమతి లేదు. వైన్ షాపులవద్ద కట్టడి తప్పకుండా పోలీసులు, సోషల్ వాలంటీర్లు చూస్తున్నారు. ఒకేసారి ఎక్కువమంది వస్తే వైన్ షాపును మూసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే, విజయనగరం జిల్లాలో మాత్రం ఎంత సేపటికీ మద్యం షాపులు తెరుచుకోలేదు. దీంతో మందు బాబులు ఆందోళనకు దిగారు. కాగా పాత ధరల నుండి కొత్త ధరలు మార్చటంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మద్యం షాపులు తెరవలేదని అమ్మకందార్లు చెబుతున్నారు. మద్యం విక్రయిస్తారని ఆదివారం చెప్పటంతో వేకువజాము నుండే క్యూలో ఉన్నామని మందుబాబులు లబోదిబోమంటున్నారు.