చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవన యజమాని లింగమనేని రమేష్. నోటీసులకు సమాధానం ఇచ్చారు. గతానికి భిన్నంగా ఈసారి స్పందించారు.
మూడేళ్ల క్రితం ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశానని, దాన్ని ఏం చేసుకున్నా తనకు సంబంధం లేదని లింగమనేని రమేష్ అప్పట్లో చెప్పారు. చంద్రబాబు కూడా నాడు ఆ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో ప్రకటించారు.
కానీ ఇప్పుడు చంద్రబాబు దాన్ని అద్దె భవనం అంటున్నారు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు లింగమనేని రమేష్ కూడా స్పందించారు. ఒక ఆంగ్ల దిన పత్రిక విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
గతంలో భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశామని చెప్పిన లింగమనేని రమేష్.. నోటీసులకు ఇచ్చిన సమాధానంలో మాత్రం తాను పంచాయతీ వారి నుంచి అనుమతులు తీసుకునే కట్టానని వివరించారు.
అయితే అందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం ఆయన జత చేయలేదని ఆంగ్ల పత్రిక వెల్లడించింది. తనకు నోటీసుల ఇచ్చిన అధికారులను కూడా లింగమనేని ప్రశ్నించారు. తనకు నోటీసులు జారీ చేసే అధికారం జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు లేదని నోటీసులకు ఇచ్చిన సమాధానంలో అభ్యంతరం తెలిపారు. ఈ అంశంపై తాను వ్యక్తిగతంగా హాజరై మరిన్ని వివరాలు వెల్లడిస్తానని సమాధానం ఇచ్చారు.