కరోనా వైరస్ పైన ఏపీ యుద్ధం, కోవిడ్ -19 వారియర్స్ రిక్రూట్‌మెంట్

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:20 IST)
'కొవిడ్ వారియర్స్' పేరిట ఏపీ ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ బృందంలో ఇప్పటివరకు 2000 మంది వైద్య విద్యార్థులు, అప్రెంటిస్‌లు చేరారు.

వారే కాకుండా, ప్రైవేటు వైద్యులు, నర్సుల సేవలు కూడా ఉపయోగించుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. దీనిపై కొవిడ్-19 స్పెషల్ ఆఫీసర్ ఎం. గిరిజా శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది అవసరం ఉందని, అందుకే 271 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేదిక్, యునానీ కాలేజీల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారి కోసం ఈ 'కొవిడ్ వారియర్స్' పథకం తీసుకువచ్చామని తెలిపారు.

వైద్య విద్యార్థులే కాకుండా, ఆసక్తివున్న మెడికల్ ప్రాక్టీషనర్లు, స్పెషలిస్టులు, నర్సింగ్ కోర్సులు పూర్తిచేసినవారు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఎవరైనా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ మెడికల్ వలంటీర్లలో అనుభవం ఉన్నవారిని కరోనా ఆసుపత్రుల్లో వినియోగించుకుంటామని, వైద్య విద్యార్థులను క్వారంటైన్ సెంటర్లలో నియమిస్తామని తెలిపారు.

వారికి కొవిడ్-19 పేషెంట్లకు ఎలా చికిత్స అందించాలో శిక్షణ ఇస్తామని గిరిజా శంకర్ వివరించారు. మెడికల్ వలంటీర్లుగా ముందుకువచ్చేవారి ప్రయాణ ఖర్చులు, ఆహార భత్యాలు భరిస్తామని, వారికి పీపీఈ కిట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సొంతూరుకు వెళ్ళేందుకు శవం గెటప్... సినీ ఫక్కీలో ప్రయాణం.. చివరకు..