ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు నోటికి పని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కుక్కతో పోల్చారు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే యేడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ సమాయత్తమవుతున్నారు. దీంతో ఆయనపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్నికల నిర్వహణపై మంత్రి కొడాలి నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ గవర్నర్ హరిచందన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లిఖతపూర్వక ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కొడాలి నాని ఏమాత్రం తగ్గలేదు. నిమ్మగడ్డ రమేశ్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారో లేక చంద్రబాబు చేతిలో ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నారు. దొంగలను తీసుకొచ్చి రాజ్యాంగ పదవిలో చంద్రబాబు కూర్చోబెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఎవరిని అడిగి స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ ఆపారని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో మాట్లాడి ఎన్నికలను నిర్వహిస్తారా? అని మండిపడ్డారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
కొడాలి నానిపై ఫిర్యాదు
ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతున్న నేపథ్యంలో, నిమ్మగడ్డను వైసీపీ నేతలు మరోసారి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. ఈ లేఖలో కొడాలి నానిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఎన్నికల నిర్వహణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
లేఖతో పాటు ఈసీని ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, వీడియో క్లిప్పింగులను కూడా గవర్నరుకు పంపారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.