ఆయనో 20 ఎకరాల ఆసామి. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. భార్య. కానీ, జీవితంలో ఏదో కోల్పోయాననే అసంతృప్తి. పైగా, సంతృప్తిలేని జీవితం గడపం ఏమాత్రం ఇష్టంలేదు. దీంతో బిర్యానీలో విషం కలిపి భార్యాబిడ్డలతో తినిపించి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన కోయా రాంప్రసాద్ (40) అనే వ్యక్తికి అదే మండలం బాణాపురానికి చెందిన మేనత్తకూతురు సునీత (30)ను 15 యేళ్లు క్రితం వివాహమైంది. వీరికి రుచిత (13), జాహ్నవి (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అయితే, రాంప్రసాద్‌కు 10 ఎకరాలు భూమి ఉండగా, అత్తమామలు కట్నం కింద మరో పది ఎగరాల పొలాన్ని ఇచ్చారు. రాంప్రసాద్.. ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో, ఆ తర్వాత విజయవాడలోని ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి మానేశాడు. కుటుంబంతో కలిసి ఖమ్మంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివశిస్తూ స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు.
అయితే, కావాల్సినంత ఆస్తి ఉన్నా గొప్పగా బతకలేకపోతున్నామనే అసంతృప్తి రాంప్రసాద్‌లో నెలకొంది. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. గురువారం రాత్రి 11 గంటల దాకా పక్కఫ్లాట్‌లో హోంవర్క్ చేసుకొని రుచిత, జాహ్నవి ఇంట్లోకి వచ్చారు. అప్పుడే రాంప్రసాద్.. వాసన రాని విషపు గుళికలను బిర్యానీలో కలుపుకొని ఇంటికి తెచ్చాడు. దాన్ని భార్యాపిల్లలు తిని గదిలో పడుకున్నాక.. రాంప్రసాద్ కూడా తిని మరో గదిలో పడుకున్నాడు.
సునీత బంధువులు శుక్రవారమే గృహప్రవేశం కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇందుకు రాంప్రసాద్ కుటుంబసభ్యులను ముందే ఆహ్వానించారు. ఉదయం 11 గంటలైనా వారెవరూ రాకపోవటంతో ఫోన్ చేశారు. తీయకపోవడంతో రాంప్రసాద్ తండ్రి.. ఇంటికి వెళ్లగా చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. రాంప్రసాద్ బైక్‌లో గుళికల మందును పోలీసులు కనుగొన్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.