విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వైసిపి నుంచి తన సోదరుడు కేశినేని చిన్నిపై ఓడిపోయారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని విశ్వసించిన కేశినేని నాని ఆ పార్టీలో చేరి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసారు. ఐతే ఓటమి పాలయ్యారు. దీనితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తను రాజకీయాలకు దూరంగా వుండదలుచుకున్నాననీ, ఐతే ప్రజాసేవ మాత్రం చేస్తూనే వుంటానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
తెదేపా కార్యకర్తలకు కోటంరెడ్డి వార్నింగ్, ఏమైంది?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. వైసిపి కార్పొరేటర్ల ఇళ్లకు ఫ్లెక్సీలు కట్టడంపై సీరియస్ అయ్యారు కోటంరెడ్డి. నేరుగా తెదేపా కార్యకర్తల దగ్గరకు వచ్చి వారు చేసిన పనిని ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 16 నెలలుగా తనను వ్యక్తిగతంగా వైసిపి నాయకులు ఎన్నో ఇబ్బందులకు గురి చేసారు. నా భార్యకు, నా కుమార్తెలకు అసభ్యకర సందేశాలను పంపించారు. చంద్రబాబు గారికి బెయిల్ రాకపోతే... నేను ఇంట్లో లేనపుడు నా ఇంటి ముందుకి వచ్చి టపాసులు కాల్చారు. నేను వచ్చిన తర్వాత ఇంట్లోనే వున్నా ఇప్పుడు వచ్చి కాల్చండి అంటే పత్తా లేకుండా పోయారు. వాళ్లకు విజ్ఞత లేదని మనం కూడా అలా చేస్తే ఎలా... ప్రస్తుతం వారిలో వారే గొడవలు పడుతున్నారు. ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు?
నియోజకవర్గం అభివృద్ది కోసం పనిచేద్దాం. ఎమ్మెల్యే, కార్యకర్తలు ఎలా వుండాలో చేసి చూపిద్దాం. నేను ఇబ్బందులు పడుతున్న సమయంలో నా వెనుకే మీరంతా వెన్నుదన్నుగా వున్నారు. మీ సంక్షేమం నా బాధ్యత. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. కానీ ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు. గంటలోపుగా మీరు కట్టిన ఫ్లెక్సీలన్నీ పెరికేసి, దాన్ని నాకు వీడియో తీసి పెట్టండి'' అంటూ చెప్పారు. దీనిపై నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.