Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం

తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం
, ఆదివారం, 22 నవంబరు 2020 (18:26 IST)
కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ  ప్ర‌తి ఏడాదీ పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు.

ఇందులో భాగంగా ఈసారి కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కార్య‌క్ర‌మాన్ని 250 మంది భ‌క్తుల‌తో ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన‌ట్టు చెప్పారు. 
 
ముందుగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకొచ్చారు.

ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. 
   
అనంతరం పార్వేట మండపం వ‌ద్ద‌ మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంత‌రం గ‌రుడ వైభ‌వం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.
 
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బోర్డు స‌భ్యులు శ్రీ ముర‌ళీకృష్ణ‌, ప్రధానార్చకులు  వేణుగోపాల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాధ్‌, విజివో బాలిరెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు బాలాజి‌, నాగరాజ, డిఎఫ్‌వో చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య పేష్కార్ జగన్ మోహనాచార్యులు, పోటు పేష్కార్  శ్రీనివాస్, ఎవిఎస్వోలు గంగ‌రాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యాయవ్యవస్థపైనే నిందితుల దాడి ఆందోళనకరం