Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నపూర్ణాదేవిగా కనకదుర్గ

అన్నపూర్ణాదేవిగా కనకదుర్గ
, బుధవారం, 2 అక్టోబరు 2019 (14:12 IST)
కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీఅమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు.

అన్నపూర్ణాదేవి సకలజీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. నిత్యాన్నదానేశ్వరిగా, ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకేకాక సకల చరాచర జీవరాశులకీ ఆహారాన్నందించే తల్లి.

లోకంలో ఆకలిని తీర్చటంకన్నా మిన్న ఏదీలేదు. అందుకే అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదంటారు. ఒక్కసారి ఆ నిత్యాన్నద్యానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించి తరించవలసిందే. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.

ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. 
 
మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘అమ్మ' అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. 

ఇంద్రకీలాద్రీ పై వేంచేసిన కనకదుర్గమ్మను అన్నపూర్ణాదేవి రూపాంలో దర్శించుకుంటే అన్ని దరిద్రాలు తోలగిపోతాయని దుర్గగుడి పండితులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి పై అమ్మవారి సన్నిదానంలో నిత్యాన్నదాన పధకం రోజురోజుకు వృద్ది చెందుతుంది. భక్తులకు అన్న ప్రసాదం రూపంలో భక్తులకు అందిస్తున్నారు.
 
పోటెత్తిన భక్తులు
శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగోరోజు భక్తులు దుర్గగుడికి పోటెత్తారు. దర్శనం కోసం నాలుగు గంటల పాటు భక్తులు క్యూలైన్‌లో ఉండాల్సి వస్తోంది. అయితే వీఐపీల పేరుతో ఇష్టానుసారం అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు లఘు దర్శనం ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?