వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో ఒక కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. "జై తెలుగు" పేరుతో ఈ పార్టీని ప్రముఖ కవి, సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు. ఈ పార్టీ జెండాను కూడా వెల్లడించారు. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల మధ్యలో తెలుపు రంగుతో జెండాను రూపొందించారు.
తెలుపు రంగుపై ఒక రథాన్ని ఏర్పాటు చేసి దానికి "అ ఆ" అక్షరాలను చక్రాలుగా పెట్టారు. రథానికి పైభాగంలో జెండా ఏర్పాటు చేశారు. ఈ వివరాలను రామ లింగేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో వెల్లడించారు. తెలుగు భాష సంస్కృతి కోసం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. తెలుగు భాష పరిరక్షణ ఆజెండాతోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.
పార్టీకి సంబంధించిన సదస్సులు ఆగస్టు నుంచి జిల్లాల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. భాష, సంస్కృతులపై రాజకీయ నాయకులు, ప్రజలకు తగిన అవగాహన కల్పించడమే తన లక్ష్యమన్నారు. భాష, సంస్కృతుల విలువ అందరికీ తెలియజేయాలనే పార్టీని స్థాపించానన్నారు. పార్టీ జెండాపై గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం, పొట్టి శ్రీరాములు, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ చిత్రాలు ఉంటాయన్నారు.