సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో వైకాపా అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు చెప్పారు. అయితే, పార్టీ మారాలన్న ఉద్దేశ్యం తనకు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మావాడేనని చెప్పారు.
గతంలో జగన్‌పై రాజకీయంగానే విమర్శలు చేశాననీ, వ్యక్తిగతంగా ఏనాడూ దూషించలేదని చెప్పారు. పైగా, జగన్ చాలా పరిణితితో వ్యవహరిస్తున్నారనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు.
కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయలేదు. ఆయన స్థానంలో తనయుడును బరిలోకి దించారు. అయితే, జగన్ సునామీలో టీడీపీ అభ్యర్థులంతా చిత్తుచిత్తుగా ఓడిపోయారు.