Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు : ఉన్నంతలో మంచి నాయకుడిని ఎన్నుకోండి ... జయప్రకాష్

Advertiesment
Jayaprakash

ఠాగూర్

, ఆదివారం, 12 మే 2024 (12:01 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, సోమవారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లుచేసింది. లోక్‌సభ ఎన్నికలు, ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు.
 
ఇక, ఎవరికి ఓటేయాలనే సందేహంపై వివరణ ఇస్తూ ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, అంతా అలాగే తయారయ్యాక ఓటెవరికి వేయాలి, ఎందుకు వేయాలనే నిరాశ వద్దని హితవు పలికారు. ఉన్నంతలో మంచి నాయకుడిని ఎంచుకోవాలని సూచించారు. మంచి నాయకుడంటే.. తాత్కాలిక తాయిలాలకన్నా, సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచేందుకే ఎక్కువ మొగ్గు చూపే వారు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచించే వారని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ సృష్టికి అనువైన చర్యలు చేపట్టే వారికి మద్దతివ్వాలని చెప్పారు. అలాంటి నాయకుడిని ఎంచుకుని ఓటేసి గెలిపించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూచించారు.
 
'ఓటు అనేది ఆ రోజు కలిగే ఆవేశంతోనో, ఆ పూట కలిగే కోపంతోనో, నేతలు ఇచ్చిన డబ్బు కోసమో, రేపు ఎవరో ఏదో ఇస్తారనే ఆశతోనో, మద్యం మత్తులోనో వేసేది కాదు. కొద్దిగా రేపేం జరగబోతోందో ఆలోచించి, జాగ్రత్తగా ఓటు వేయండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సమాజానికి మేలు చేసే నాయకుడికి ఓటేయండి. ఏ పార్టీ అయినా సరే.. బడిత ఉన్న వాడిదే బర్రె అయిపోయింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది. అధికారం కేంద్రీకరించి తమ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఓటేయాలి..? నేతలంతా ఒక్కటే కదా.. ఇక్కడున్న నేత అక్కడికి, అక్కడున్న నేత ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. 
 
ఎవరిని ఎన్నుకోవాలి..? ఈ పరిస్థితిలో నాకు ఒకే ఒక్క ఆశాకిరణం కనిపిస్తోంది. యువత భవిష్యత్తు కాపాడాలి, మనందరికి మంచి జీవితం కావాలంటే.. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగడానికి తోడ్పడే నాయకుడిని ఎంచుకోవాలి. డబ్బంతా తాత్కాలిక తాయిలాలకు ఖర్చుపెట్టే నాయకుడు కచ్చితంగా ప్రమాదకరం' అంటూ జయప్రకాశ్ నారాయణ్ చెప్పుకొచ్చారు. రేపటి గురించి ఆలోచించి పనిచేసే నాయకుడిని గుర్తించి, అతడికి ఓటేసి గెలిపించుకోవాలని తెలుగు రాష్ట్రాల ఓటర్లకు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల కన్నుమూత!!