Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తమ తాలిబన్ నాయకుడు జగన్ రెడ్డి : జనసేన

Advertiesment
Janasena
, బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:51 IST)
రాష్ట్రంలో కరోనా సృష్టించిన విలయం కంటే జగన్ రెడ్డి ప్రభుత్వం సృష్టిస్తున్న కల్లోలమే అధికమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలు చేసి ప్రాథేయపడ్డారని అధికారం ఇస్తే విధ్వంసం సృష్టించారని, గడచిన ఆరు నెలల కాలంలో ప్రజల నెత్తిన రూ. 50 వేల కోట్ల భారం మోపారన్నారు.

ఇప్పుడు జగనన్న కరెంటు షాక్ పథకం పేరిట ప్రజల నెత్తిన మరో భారం మోపేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ట్రూ  అప్ చార్జీల పేరుతో ప్రజలపై అదనపు ఛార్జీలు వడ్డిస్తూ నడ్డి విరుస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీల భారం తగ్గించకుంటే ప్రజలతో కలసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “ప్రజల నెత్తిన పన్నుల భారం పథకాల్లో భాగంగా జగనన్న కరెంటు షాక్ పేరిట కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చారు. ఈ విద్యుత్ షాక్ పథకానికి గత ఏడాదే నాంది పలికారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో విద్యుత్ బిల్లుల్లో శ్లాబులు మార్చి ప్రజల మీద రూ. 5 వేల కోట్ల భారం మోపారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.

గత ఏప్రిల్ – మే నెలల్లో ఈ అదనపు భారం విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజల మీద పడింది. ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వాడకంతో సంబంధం లేకుండా బిల్లులు వేసే పద్దతిని ప్రవేశపెట్టారు. గతంలో అధిక ఛార్జీలు, డిస్కంలు, పంపిణీ సంస్థలకు అయ్యే అదనపు ఖర్చుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. జగన్ రెడ్డి పాలనలో మాత్రం సర్ధుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు ఇలా వివిధ రూపాల్లో వడ్డీలతో సహా ప్రజల మీద భారం మోపుతున్నారు. అందుకే జనసేన పార్టీ దీనికి జగనన్న కరెంటు షాక్ పథకంగా నామకరణం చేస్తోంది.

నిరంతర ప్రక్రియగా అదనపు బాదుడు
2014 నుంచి 2019 వరకు వాడుకున్న విద్యుత్ కి ట్రూ ఆప్ ఛార్జీల పేరిట ప్రజల మీద సుమారు రూ. 3690 కోట్ల అదనపు భారం వేస్తున్నారు. దీనితోపాటు 2019-2020కి మళ్లీ అదనపు ఛార్జీల సర్ధుబాటు కింద మరో రూ. 2800 కోట్లు కలిపి మొత్తం రూ. 6400 కోట్ల అదనపు వసూళ్లకు రంగం సిద్ధం చేశారు. అక్కడితో ఆగలేదు.

2021-2022 సంవత్సరానికి ఈ ఏడాది వాడే 45000 మిలియన్ యూనిట్ల విద్యుత్ కు ఒక్కో యూనిట్ కి రూ. 2 చొప్పున మరో భారం మోపడం ద్వారా రూ. 9000 కోట్లు ప్రజల మీద పడబోతోంది. మొత్తం కలపి రూ. 15,300 కోట్లు. ప్రజలు కరెంటు వాడకపోయినా, ఫ్యాన్ వేసుకోకపోయినా, ఫ్రిజ్ స్విచ్ ఆన్ చేయకపోయినా, టీవీ చూడకపోయినా రూ. 15,300 కోట్లు అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి.

ఇది ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ నెలకో, రానున్న 8 నెలలకో కాదు. దీన్ని ఒక నిరంతర ప్రక్రియగా రాబోయే రెండేళ్లు విద్యుత్ నియంత్రణ మండలి ముసుగులో వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.

కేంద్రం తక్కువకిస్తుంటే ఎక్కువకు ఎందుకు కొంటున్నారు?
ఈ వసూళ్లలో కూడా జగన్ రెడ్డి అవినీతి దాగి ఉంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తో సహా అన్ని రాష్ట్రాలకు యూనిట్ విద్యుత్ రూ. 2.70 పైసలకు అందిస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలు, విద్యుత్ సంస్థల తగ్గర నుంచి యూనిట్ రూ. 5.50 పైసల నుంచి రూ. 8 వరకు కొనుగోలు చేస్తున్నారు.

అలా ఎందుకు కొంటున్నారని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు వారి దగ్గర కొనకుండా ప్రయివేటు విద్యుత్ సంస్థల దగ్గర కొనుగోలు చేయడం వెనుక వేల కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని అర్థమవుతోంది. ప్రజా ధనాన్ని లూటీ చేసి ప్రజల్ని వంచిన్తున్నారనేది నిజం. ప్రతి యూనిట్ కి రూ. 1.23 పైసలు అదనంగా చెల్లించాలి.

దీనికి సర్దుబాటు ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, వడ్డీలు అదనం. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వాడిన విద్యుత్ కి ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు చెల్లించాలో రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ అదనపు ఛార్జీల వల్ల సామాన్యుల మీద మాత్రమే కాదు రైతుల మీద కూడా అదనపు భారం పడబోతోంది. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి రైతాంగం మొత్తం మీద అదనపు భారం మోపేందుకు సిద్ధమయ్యారు.

వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇక అద్దె ఇళ్లలో ఉండేవారు అయితే చాలా గందరగోళానికి, భయానికి గురవుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఎవరో వాడిన బిల్లులకు ఇప్పుడు అదనపు భారం వీరు ఎందుకు చెల్లించాలి? యజమానులు బిల్లులు ఎంత వస్తే అంత కట్టమంటున్నారు. వారు ఏ విధంగా చెల్లిస్తారు?

వైసీపీకి అవకాశం ఇచ్చిన ఫలితం ఇది 
రాష్ట్రంలో కరోనా సృష్టించిన కల్లోకలం కంటే జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ వైరస్ సృష్టించిన కల్లోలమే ఎక్కువ ఉంది. ఇసుక లేక 70 నుంచి 80 లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పెట్టుబడులు రాక, పరిశ్రమలు లేక 32 లక్షల మంది యువత నిరుద్యోగులుగా మారిన పరిస్థితి. కరోనా వల్ల కూడా ఇంత విధ్వంసం జరగలేదు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇచ్చినందుకు 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వైసీపీకి అవకాశం ఇచ్చినందుకు పాపానికి రాష్ట్రం ఇంత విధ్వంసానికి గురవ్వాలా? జరుగుతున్న పరిస్థితుల్ని ప్రజలు గమనించాలి. ఇదేమని అడిగితే మాట్లాడితే రాష్ట్రంలో విద్యుత్ వాడకం పెరిగిందని చెబుతున్నారు. 2019-2020 సంవత్సరాల్లో విద్యుత్ వాడకం పెరగలేదు. అదనపు కొనుగోళ్లు లేవు. అమ్మకాలు లేవు.

గతంలో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం 41,608 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే జరిగిన వాడకం 37, 166 మిలియన్ యూనిట్లే. రాష్ట్ర ప్రజలు 4 వేల మిలియన్ యూనిట్లు తక్కువ విద్యుత్ వినియోగించారు. మీరు చెబుతున్న అదనపు వాడకం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలి.

వైసీపీది సంక్షోభ పాలన 
గత ఆరేడు నెలల్లో పన్నుల రూపంలో రూ. 50 వేల కోట్ల భారం మోపారు. జి.వొ. 198 పేరిట ఇంటి పన్నుల రూపంలో రూ. 15 వేల కోట్లు, విద్యుత్ సర్ధుబాటు ఛార్జీల రూపంలో రూ. 15,300 కోట్లు, మద్యం అమ్మకాలను ప్రోత్సహించి రూ. 20 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన వేశారు. ఇది వాస్తవం కాదా? సంక్షేమ పాలన అందిస్తారనుకుంటే ప్రజల నెత్తిన పన్నులు, ఛార్జీల భారం పాలన అందిస్తున్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన నడుస్తోంది. మీకు ఇదే చివరి అవకాశం అని గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు తప్పదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంటి పన్నులు, కరెంటు బిల్లుల పేరుతో వాయింపుడు పథకాలు పెట్టింది..

ఉత్తమ తాలిబన్ నాయకుడు మీరే అవుతారు
అసలు జగన్ రెడ్డి పాలించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాదు ఆఫ్ఘనిస్థాన్. అక్కడ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మహిళల మీద దాడులు ఉంటాయి. అదే సమయంలో అభివృద్ధికి వ్యతిరేకంతో కూడిన పాలన సాగుతుంది. అదే తరహా పాలన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. ఎక్కడపడితే అక్కడ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. అభివృద్ధి అన్న మాటే లేదు.

ఆయన ఆఫ్ఘనిస్థాన్ ని పాలిస్తే మంచి తాలిబన్ నాయకుడిగా పేరు వస్తుంది. వాడని విద్యుత్ కి ఛార్జీల మోత మోగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కచ్చితంగా పోరాటం చేస్తారు. ప్రజా ఉద్యమాలు తీవ్రమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. విద్యుత్ ఛార్జీల వ్యవహారంలో ప్రభుత్వం తన నిర్ణయాలు వెనక్కి తీసుకోకుంటే ప్రజలతో కలసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం” అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నకిలీ స్టిక్కర్లతో పట్టుబడ్డ 138 మంది వాహనదారులు