అనంతపురం జిల్లా సమీక్షా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... చాలామంది నీ బలం అంతా కోస్తా జిల్లాల్లోనే అంటూ నన్ను ఓ ప్రాంతానికి పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనంత కవాతు అది నిజం కాదని రుజువు చేసింది. గత నెల 2న జరిగిన జనసేన కవాతు చరిత్రలో మిగిలిపోతుంది. రాయలసీమలో సైతం జనసేనకు విశేష ఆదరణ ఉందని తెలియచేసింది.
అనంతపురం గొప్ప చైతన్యం ఉన్న జిల్లా. గొప్ప పేరున్న గ్రంథాలయాలతో సరస్వతీ నిలయంగా ఉన్న జిల్లాలో కాలక్రమేణా దౌర్జన్యం చేసే వారు పెరిగిపోయాయి. అందరికీ అనంత పేరు చెప్పగానే ఫ్యాక్షన్ గుర్తుకు వస్తుంది. నాకు మాత్రం తరిమెల నాగిరెడ్డి గారు గుర్తుకు వస్తారు. అవకాశాలు లేనిచోట కసి ఉంటుంది. ఆకలి ఉన్న చోట ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్న జిల్లానే మన అనంతపురం. అనంతపురంలో నెలకొన్న కరువును ఒక్క రోజులో పరిష్కరించలేం.
అంతా ఈ ప్రాంతాన్ని వెనుకబడిన జిల్లా అంటారు. నేనైతే రాజకీయ వెనుకబాటుతనం ఉన్న జిల్లా అంటాను. రాజకీయ వెనుకబాటుతనం వల్లే ఈ జిల్లాలో కరువు కదలకుండా మిగిలిపోయింది. నీరే లేని ఇజ్రాయిల్ దేశం గొప్ప ఆలోచనలతో పుష్కలంగా పంటలు పండిస్తున్నప్పుడు అనంతలో మనం ఆ ప్రయోగం ఎందుకు చేయలేం. పాలకులకి సంకల్పం లేకే దీనిపై దృష్టి పెట్టడం లేదు. ఇవ్వడం అనే లక్షణం ప్రకృతి దయితే తీసుకోవడం మనిషి లక్షణంగా మారిపోయింది. అందుకే ఈ జిల్లా వాసులు వెనుకబడిపోయారు. గెలవాలి అనే ఉద్దేశంతో పాలిటిక్స్‌లోకి రాలేదు. వ్యవస్థను మార్చాలి అన్న ఉద్దేశంతో పార్టీ పెట్టాను.
పార్టీ ఏర్పాటు చేసే సమయంలో పెద్దపెద్ద మేధావులు వస్తారన్న నమ్మకం నేను పెట్టుకోలేదు. కేవలం యువతని నమ్మాను. యువత బాధలే, నా బాధలు. వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తాను. వ్యక్తి ఆధారిత పార్టీలు ఏదో ఒక రోజున దెబ్బతినక మానవు. బలీయమైన భావజాలంతో ఏర్పాటైన పార్టీలు చిరకాలం మిగిలిపోతాయి. అలాంటి పార్టీ జనసేన పార్టీ. అనంత ప్రజలు, యువత మార్పుని బలంగా కోరుకుంటున్నారు. మార్పు వచ్చే సమయం ఆసన్నమైంది. అవినీతి పార్టీలతో చేతులు కలపను అంటే, కొందరు ఎక్కడ లేదు అవినీతి అని ప్రశ్నిస్తున్నారు. నేను మాత్రం అవినీతి రహిత రాజకీయాలే చేస్తాను అన్నారు.