Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన ప్రజాదర్బార్!!

Pawan kalyan

వరుణ్

, గురువారం, 1 ఆగస్టు 2024 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో దోపిడీకి, అన్యాయానికి గురైన ప్రజలు తమ సమస్య పరిష్కారం కోరుతూ ప్రస్తుత పాలకులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకోసం టీడీపీ ఇప్పటికే అమరావతిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తుంది. ఇపుడు ఇదే బాటలో ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన పార్టీ కూడా శ్రీకారం చుట్టింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం చేపడుతుంది.
 
ఎన్నికలకు ముందు జనసేన పార్టీ జనవాణి - జనసేన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించే కార్యక్రమాన్ని ఆరంభించారు. ఇందులో భాగంగా నిత్యం ఒక మంత్రి, పార్టీకి సంబంధించి నాయకుడు .. ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వారి వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి విచ్చేసి అర్జీలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. 
 
ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా ఆగస్టు 1వ తేదీ (గురువారం) నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాసమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించాలని నిర్ణయించింది. జనసేనాని ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఒక్కో ప్రజాప్రతినిధి విధిగా రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజలు, పార్టీ శ్రేణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేల షెడ్యూల్ వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా ఛాన్స్ పేరుతో మహిళా టెక్కీపై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం!!