జనసేన కొత్త నినాదానికి శ్రీకారం చుట్టింది. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి నుంచే దీన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి నుంచి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా ప్రకటించారు.
పండుగ కోసం ఏ వస్తువు కొన్నా.. అది ఎక్కడ తయారైందో చూడాలని పవన్ పిలుపు నిచ్చారు. మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదమని పవన్ స్పష్టం చేశారు. 'ఆత్మ నిర్భర్ భారత్' నినాదం ఏ ఒక్క వర్గానికో కాదని.. దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించిందని చెప్పుకొచ్చారు. 'మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి..' ఇదే 'ఆత్మనిర్భర భారత్' అని పవన్ అభివర్ణించారు.
అందుకే ఈ వినాయక చవితి నుంచే ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని జనసేన- భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిర్ణయించాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.