కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అపుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్నారు. కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు.
దీనిపై పవన్ కళ్యాణ్ బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించానని, అందువల్ల తన తుదిశ్వాస ఉన్నంత వరకూ ప్రజల కోసం పోరాడుతానని తేల్చిచెప్పారు.
ఇక అమరావతిలోని ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయడంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. 'పర్యావరణ నిబంధనలను అతిక్రమించే ప్రదేశం ఈ భారతదేశం. నిబంధనలు అతిక్రమించే పెద్దస్థాయి వ్యక్తులైనా, చిన్నస్థాయి వ్యక్తులు అయినా అందరికీ సమానంగా న్యాయం జరగాలి. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ప్రతీ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చాలి. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నా' అని అన్నారు.
కరకట్టపై 60కి పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు ఏపీ మంత్రులు చెబుతున్నారనీ, వాటిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసం కూడా ఉందన్నారు. అందువల్ల వీటన్నింటినీ ప్రజా వేదికను కూల్చినట్టుగానే అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.