చెప్పాడంటే... చేస్తాడంతే! ఇదే స్లోగన్‌తో ఏపీలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... ముందస్తుగా క్యాలెండర్ రిలీజ్ చేసి మరీ పార్టీ మ్యానిఫెస్టోలో లోని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గురువారం ఆంధ్రప్రదేశ్ అంతటా, జగనన్న కాలనీలలో శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించారు. ఒక రోజు ముందు క్యాబినేట్ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులందరికీ... రేపటి నుంచి పేదలకు ఇళ్ళ శంకుస్థాపనలు చేయించండని ఆదేశించారు.
అంతే, నేటి ఉదయమే ఎమ్మెల్యేలు, మంత్రులంతా జగనన్న కాలనీలకు చేరిపోయారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధి దారులను పలిపించి, వాళ్ళ స్థలాల్లో ముగ్గు పోయించి... ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తున్నారు.
ఏపీలో రూరల్, అర్బన్ కలిపి 9,024 లేఅవుట్లలో జగనన్న కాల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 7 లక్షల ఇళ్ళను దేశంలోనే రికార్డు స్థాయిలో నిర్మిస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు. జులై 1, 3, 4 తేదీల్లో జగనన్న కాలనీల్లో (Jagananna Colony)నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సవం ఏర్పాటు చేశారు.
ఇప్పటికే లబ్ధిదారులకు సెంటు భూమిని కేటాయించి, పట్టాలు కూడా పంపిణీ చేశారు. ఇపుడు ఆ కాలనీలలో ప్రతి ఇంటికి శంకుస్థాపన పనిని ప్రారంభించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 1 లక్షా 80 వేల ఆర్ధిక సహాయం అందించనున్నారు. వీటిని ఏడాదిలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, జగనన్న కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు 40 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు.
ఇకపై సిటీల్లో జగనన్న టౌన్‌షిప్‌లు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లో స్థలాల్ని సేకరించి లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు కేటాయించనున్నారు. దీని కోసం అర్బన్ ఏరియాల్లో స్థలాలు సేకరించాలని సీఎం రెవిన్యూ అధికారులను ఆదేశించారు.