కరోనా సంక్షోభసమయంలో పేదకుటుంబాలు కూలి పనులు దొరకక అల్లాడుతుంటే శ్రీ వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలు వారిని చాలావరకు ఆదుకున్నాయని....ఇది ఆర్దికవేత్తలు అంటున్న మాటలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సూర్య బలిజ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శెట్టి అనంతలక్ష్మి అధ్యక్షతన తాడేపల్లి లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సూర్య బలిజ కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం అనేవి ప్రస్తుత సమాజంలో పేద కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని అవి ఖరీదైనవి కావడంతోనే ఈ పరిస్ధితి ఏర్పడిందని అన్నారు.
ప్రాణాపాయ పరిస్ధితులలో మందులు ఉన్నాయని తెలిసీ కూడా వాటిని కొనే శక్తి లేక పేదవర్గాలు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాయని అన్నారు. వాటిని పరిష్కరించాలనే దిశగా దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజురీయంబర్స్ మెంట్ ప్రవేశపెట్టి పేదవర్గాల ఇబ్బందులను తొలగించారన్నారు. నేడు శ్రీ వైయస్ జగన్ విద్య, వైద్యాన్ని పేదవర్గాల చెంతకు తీసుకువెళ్లేలా అనేక పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
నాడు-నేడు ద్వారా అటు గ్రామాలలో స్కూల్స్‌ను, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను అభివృద్ది చేస్తున్నారని తద్వారా పేద వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తున్నారని వివరించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కూడా ఆ మొత్తాలను తల్లుల ఖాతాలలోకి వేస్తున్నారని వివరించారు. అదే విధంగా ఇంటి స్ధలాలు ఇచ్చినా కూడా వాటిని తల్లుల పేరుపైన ఇచ్చారని వివరించారు.
ఆసరా, చేయూత వంటి పధకాలతో ప్రతి పేద ఇల్లు కూడా లబ్దిపొందేలా చేస్తున్నారని అన్నారు. అధికారం అంటే అనుభవించేదిగా కాకుండా బాధ్యతగా ప్రజలను పరిపాలించేదిగా శ్రీ వైయస్ జగన్ కొత్త నిర్వచనం చెప్పారని అన్నారు. బిసిలను అభివృధ్ది పధంలోకి తీసుకువెళ్లేందుకు అనేక ప్రత్యేక పధకాలను ప్రవేశపెట్టారనీ... వాటిని సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు.
శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బలహీన వర్గాల శకం మొదలవ్వాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారని తెలిపారు. అది ఒక బలమైన సమాజ నిర్మాణానికి నాంది కావాలన్నదే సీఎం శ్రీ వైస్ జగన్ ఆశయమని వివరించారు.
ఆయన ఆలోచనలు, ఆశయాలు మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే గడచిన 20 రోజులుగా అన్ని బీసీ కులాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఎన్నికల సభలు కాదన్నారు. రాజకీయంగా బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు వారిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపాలన్న మంచి ఆలోచనతో ఈ సమావేశాలు జరుపుతున్నట్లు తెలిపారు. సీఎం ఆలోచనలను అందిపుచ్చుకుని మీ కులంలో మీరు శక్తివంతులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడు పదవులు, అవకాశాలు మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయని అప్పిరెడ్డి ప్రకటించారు.
వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మెరుగు నాగార్జున మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రజారంజక పాలన కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికలప్పుడు కుల సంఘాల సభలు, సమావేశాలు జరగడం మామూలే కానీ... ఏ ఎన్నికలు లేకుండా, రాజకీయ లబ్ది ఆశించకుండా జరుగుతున్న ఈ సమావేశాలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని వివరించారు. దీన్ని బీసీ కులాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, తరతరాలుగా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న జాతి సూర్య బలిజ అన్నారు. సీఎం శ్రీ వైయస్ జగన్ తన స్వీయ పరిశీలనలో దీన్ని గుర్తించారు కనుకనే వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీన్ని ఒక చక్కని వేదికగా ఉపయోగించుకుని మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే అన్ని రంగాల్లో సమర్ధవంతులైన నాయకులుగా ఎదగాలని కోరారు. సమావేశంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ అంకంరెడ్డి నారాయణమూర్తి సూర్యబలిజ కులసంఘ రాష్ర్ట నేతలు,సూర్య బలిజ కార్పోరేషన్ డైరక్టర్లు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.