ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదో విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీలకు నిధులను కేటాయించారు. ఓ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలు అప్పుల భారం పడకూడదని, వారి పిల్లల చదువుకు ప్రోత్సాహం అందించేందుకు వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా వంటి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అర్హులైన 10,132 మంది దంపతులు, పిల్లలకు ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో పేరుకే వాస్తే ఇవ్వలేదని జగన్ అన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి 5వ విడత ఇస్తున్నామని, దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నామని జగన్ చెప్పారు. ఇప్పటి వరకు 56,194 జంటలకు రూ.427 కోట్లు జమ చేశామని సీఎం జగన్ తెలిపారు.
నిరుపేద తల్లిదండ్రులకు తమ బిడ్డల వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని అధికారులు తెలిపారు. వధూవరులిద్దరూ తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే షరతుపై వైఎస్ఆర్‌సి ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాను అమలు చేస్తోంది.