నవ్యాంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్ల వైకాపాకు చెందిన ఎమ్మెల్యే, నేతల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నవ్యాంధ్ర లేదా ఉమ్మడి ఆంధ్రదేశ్ లేదా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఒక ముఖ్యమంత్రి కింద ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్న దాఖలాలు లేవని అంటున్నారు.
గత నెల 30వ తేదీన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి జూన్ 8వ తేదీన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మొత్తం 25 మందితో ఆయన కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో ఒకరు బీసీ, మరొకరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు.
కానీ, ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా, దేశంలో ఈ తరహాలో ఇద్దరికి మించి ఉప ముఖ్యమంత్రులుగా నియమించిన దాఖలులేవు. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురుని డిప్యూటీ సీఎంలుగా చేస్తున్నారు.
కాగా, ముగిసిన ఎన్నికల్లో వైకాపా 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 23 సీట్లు, జనసేన ఒక సీటుతో సరిపెట్టుకుంది. అలాగే, 25 ఎంపీ సీట్లలో వైకాపాకు 22, టీడీపీకి మూడు ఎంపీ సీట్లు దక్కాయి.