Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగుబిడ్డలకు తెలంగాణలో వైద్యం చేయించుకునే హక్కు లేదనడం దుర్మార్గం

తెలుగుబిడ్డలకు తెలంగాణలో వైద్యం చేయించుకునే హక్కు లేదనడం దుర్మార్గం
, సోమవారం, 10 మే 2021 (22:21 IST)
తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 386 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేసి, పేదలకు రూ.5కే భోజనం అందించామని, ఒక్కపూటలోనే కొన్నిలక్షలమంది తమ ఆకలి తీర్చుకునేవారని, వాటిని జగన్మోహన్ రెడ్డి మూసేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తననివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

తమిళనాడులో ప్రధానరాజకీయపార్టీల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మరో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నవారిపై సహజంగా కత్తులు దూస్తుంటుందని, అటువంటి రాష్ట్రంలో 2013లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మక్యాంటీన్లు నేటికీ నడుస్తూనే ఉన్నాయన్నారు. తాజాగా స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక, డీఎంకే కార్యకర్తలు అమ్మక్యాంటీన్లపై దాడులకు తెగబడితే, తనపార్టీ వారనికూడా చూడకుండా స్టాలిన్ వారిపైచర్యలు తీసుకోవాలని పోలీసులనుఆదేశించాడన్నారు.

అమ్మ క్యాంటీన్లు మూసేయమని, అవి కొనసాగుతాయని కూడా ఆయన చెప్పడం జరిగిందన్నారు. దానితోపాటు, మరికొన్ని ప్రజాకర్షక పథకాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే, స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలను రాజశేఖర్ రెడ్డి కొనసాగించాడని, ఆయన ప్రారంభించిన సున్నా వడ్డీని కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యప్రభుత్వాలు అమలుచేశాయన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక పావలావడ్డీతో పాటు, సున్నా వడ్డీ పథకాలనుకూడా కొనసాగించడం జరిగిందన్నారు.

అన్నాక్యాంటీన్లు మూసేయడం ఎంతవరకు న్యాయమో జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలన్నారు. కావాలంటే తన తండ్రిపేరుతో రాజన్న క్యాంటీన్లను నిర్వహించాలని, తాము చెప్పినా ఈ ముఖ్యమంత్రి వినలేదన్నారు. రాష్ట్రంలోని పేదలకడుపు నిండితే చాలని, అన్నాక్యాంటీన్లను మూసేయవద్దని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మొత్తుకుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అన్నాక్యాంటీన్లు తిరిగిప్రారంభించి, ఆకలిచావులను నిరోధించాలని సోమిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
 
కరోనాతోచనిపోయిన వారిలెక్కలను ప్రభుత్వం దాచేస్తోందని, నెల్లూరు జిల్లాలో రోజుకి 60 నుంచి 70 మంది వరకుచనిపోతుంటే, కేవలం 6గురు, ఏడుగురు మాత్రమే చనిపోయారని చెబుతున్నారన్నారు. ఆక్సిజన్ నిల్వలు లేక రోగుల చనిపోతున్నారన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పేరు మార్చి, సేవలు పెంచామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కింద ఎందరు పేదలకు ఎన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందో చెప్పాలన్నారు. పేదకుటుంబాల్లో పెద్ద దిక్కు చనిపోతే చంద్రన్నబీమా ద్వారా ఆకుటుంబాలకు ఆసరా లభించేలా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుంటే, ఈ ముఖ్యమంత్రి దాన్ని కూడా నిలిపేశాడన్నారు.

చంద్రన్నబీమా పథకాన్ని తీసేసిన విషయం అసలు ఈ ముఖ్యమంత్రికి తెలుసునా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. కుటుంబంలో 18ఏళ్లు పైబడినవారు ఎందరు చనిపోయినా, వారందరికీ చంద్రన్నబీమా వర్తించేలా, రూ.2 లక్షల సాయమందేలా ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు రూ.2 లక్షలిస్తే, ఈ ప్రభుత్వానికొచ్చే నష్టమేమీ లేదన్నారు. ప్రభుత్వం తరుపున ఇచ్చే ఎక్స్ గ్రేషియాతో సంబంధం లేకుండా చంద్రన్న బీమా సొమ్ము అందేలాచూడాలన్నారు. ఆక్సిజన్ నిల్వలు,సరఫరాపై ప్రభుత్వం వెంటనే దృష్టిపెట్టాలన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులవారు ఆక్సిజన్ నిల్వలు లేవనిచెప్పి, రోగులను చేర్చుకోవడం లేదన్నారు. హైదరాబాద్ ప్రస్తుతంకూడా ఉమ్మడిరాజధానిగా ఉందని, అటువంటిది అక్కడకు వైద్యంకోసం వెళ్లేవారిని నిలువరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమో ముఖ్యమంత్రి ఆలోచనచేయాలన్నారు. ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ బేధాభిప్రాయాలు తలెత్తాయో తెలియదుగానీ, తెలుగుబిడ్డలకు తెలంగాణలో వైద్యం చేయించుకునే హక్కు లేదనడం దుర్మార్గమని సోమిరెడ్డి వాపోయారు.

చెన్నై, బెంగుళూరు ప్రాంతాలకు వెళ్లడానికి అక్కడి ప్రభుత్వాలు ఎటువంటి అవరోధాలు కల్పించడం లేదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే వ్యాక్సిన్లకు అవసరమైన డబ్బు కట్టాలన్నారు. రూ.2కోట్ల 20లక్షల బడ్జెట్ పెట్టుకొని రూ.1500, రూ.1600 కోట్లతో వ్యాక్సిన్లు కొనడానికి ప్రభుత్వం ఎందుకింతలా ఆలోచిస్తోందో తెలియడంలేదన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలేమిటో, ఎవరికీ అంతుబట్టడంలేదన్నారు.

రాజకీయాలతో తమకు పనిలేదని, ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని, వారిని కాపాడి, కావాలంటే ఆఘనతంతా ముఖ్యమంత్రే పొందవచ్చన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే వ్యాక్సిన్ల కొనుగోలుకు అవసరమైన సొమ్ము చెల్లించాలని,  ఆక్సిజన్ నిల్వలపై దృష్టిపెట్టాలని, అన్నాక్యాంటీన్లు ప్రారంభించాలని, చంద్రన్నబీమాకింద రూ.2లక్షలసాయం అందించాలని ముఖ్యమంత్రిని పేద, మధ్యతరగతి కుటుంబాల తరుపున విజ్ఞప్తిచేస్తున్నట్టు చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమత బెనర్జీ మంత్రివర్గంలో.. మనోజ్ తివారీకి చోటు..!