హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ తేజ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.
హీరో సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై వేగంగా డ్రైవ్ చేస్తుండగా, శుక్రవారం రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌ను ( ట్రంప్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు.
అప్పటికపుడు హుటాహుటిన సాయిధరమ్ తేజ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు, ఛాతి వద్ద, మరికొన్ని చోట్ల గాయాలున్నట్లు చెపుతున్నారు. ప్రమాదం సమయంలో సాయి ధరమ్ తేజ్ ధరించిన హెల్మెట్ దూరాన పడి ఉండటం గమనించారు. హెల్మెట్ ధరించి ఉండటం వల్ల ప్రాణ నష్టం తప్పిందని, బండి స్కిడ్ అయి ఈ ప్రమాదం జరిగనట్లు చెపుతున్నారు.