Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక హోదా రాకున్నా ఆగని పెట్టుబడుల ప్రవాహం... ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకున్నా పారిశ్రామిక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రంగానికి కొన్ని రాయితీలు వచ్చే మాట వాస్తవమే. అయితే అంతకుమించిన అంశాలు కూడా ఉంటాయని ఇక్కడ రుజువైంది. ఏదైనా ఒక ప్రాంతంలో పారిశ్రామిక

ప్రత్యేక హోదా రాకున్నా ఆగని పెట్టుబడుల ప్రవాహం... ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఎప్పుడు?
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (16:54 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకున్నా పారిశ్రామిక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రంగానికి కొన్ని రాయితీలు వచ్చే మాట వాస్తవమే. అయితే అంతకుమించిన అంశాలు కూడా ఉంటాయని ఇక్కడ రుజువైంది. ఏదైనా ఒక ప్రాంతంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ప్రధానంగా ఆ ప్రాంతంలో లభించే వనరులు (ముడిపదార్థాలు), భూమి, నైపుణ్యత కలిగిన మానవ వనరులు, ప్రభుత్వం కల్పించే రాయితీలు, మౌలిక వసతుల ఆధారంగా ఆసక్తి చూపుతారు. వీటన్నిటికీ మించి విదేశాల్లో స్థిరపడిన సంపన్న వర్గాలు తమ జన్మభూమిపై మక్కువ కూడా మరో ప్రధాన కారణమవుతోంది.
 
రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ఇక నైపుణ్యత కలిగిన మానవ వనరులకు ఇక్కడ కొదవలేదు. పరిశ్రలమల స్థాపనకు అవసరమైనంత భూమి కూడా అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, పారిశ్రామిక అవసరాలకు కావలసినంత భూమిని కేటాయింస్తోంది. అలాగే జాతీయ రహదారులు, విద్యుత్, ఫైబర్ నెట్, పోర్టులు, అంతర్గత జలరవాణా వంటి మౌలిక వసతుల కల్పనకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనేక రాయితీలు కల్పిస్తోంది. దాంతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.25 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధి రేటు, 2015-16 నాటికి 11.1 శాతంగా నమోదై రెండంకెల వృద్ధి రేటు సాధించి.
 
రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక  ఉత్పత్తి రూ.63,229 కోట్ల (2011-12 ధరల ఆధారంగా)తో  9.98 శాతం వృద్ధి రేటు నమోదైంది. పారిశ్రామిక వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ స్థిరమైన రెండంకెల వృద్ధి రేటు సాధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అయిదేళ్లకు (2015-2020) రూపొందించిన పారిశ్రామిక విధానం మంచి ఫలితాలనిస్తోంది. వివిధ రంగాలలో రూ.3,17,000 కోట్ల పెట్టుబడులు, 28,25,000 ఉద్యోగాలు లక్ష్యంగా వివిధ పాలసీలను రూపొందించింది.  ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖలు తీసుకునే చర్యల వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పాలసీ రూపొందించిన ఏడాదిలోనే పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.  
 
ప్రభుత్వం పది ప్రధాన రంగాలను గుర్తించి, వాటిని ప్రోత్సహిస్తోంది. ఆగ్రో అండ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్స్, వస్త్రాలు-దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్ – ఆటో విడిభాగాలు,  పెట్రోకెమికల్స్, ఇంధనం, మినరల్ ఆధారిత పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ రంగాలు రాష్ట్రంలో విస్తరించడానికి అవకాశం ఉంది. దాంతో ఈ రంగాల్లో  ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. వీటన్నిటి రీత్యా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రవాస తెలుగువారు స్వరాష్ట్రంలో సొంతగడ్డపై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇంకా వస్తున్నారు.
 
పరిశ్రమల స్థాపనకు, వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం కల్పించి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత సంవత్సరం 2వ స్థానంలో ఉన్న ఏపీ ఈ ఏడాది మొదటి స్థానానికి ఎగబాకింది. ప్రపంచ బ్యాంకు ఎనర్జీ ఎఫిషియన్సీ 2016 నవంబర్ నివేదిక ప్రకారం విద్యుత్ ని ఆదా చేయడంలో, సమర్థవంతంగా వినియోగించడంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. 2015-16లో  ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఆ విధంగా ఏపీ మొదటి స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పన విభాగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచి ఇండియాటుడే అవార్డు గెలుచుకుంది. అలాగే ఆర్బీఐ 2016 సెప్టెంబర్ బులిటెన్ ప్రకారం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఉంది.
 
పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ మొదటి స్థానానికి ఎగబాకింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్ అంచనాలపై చేసిన అధ్యయనంలో  దేశంలో ఏ రాష్ట్రం సాధించనంతటి వృద్ధిని ఏపీ సాధించింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద రాష్ట్రానికి 8.1 శాతం పారిశ్రామిక  పెట్టుబడులు రాగా,  2015-16 లో  15.8 శాతం పెట్టుబడులు వచ్చాయి. అంటే  ఒక్క ఏడాది కాలంలో 7.7 శాతం పెట్టుబడులు పెరిగాయి. గత ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్ డిపి) వృద్ధి రేటులో కూడా దేశం మొత్తం మీద ఏపీ  మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 7.3 శాతం ఉండగా, రాష్ట్రం 10.5 శాతం వృద్ధి రేటు సాధించింది. తలసరి ఆదాయం రాష్ట్రంలో తొలిసారిగా లక్ష రూపాయలకు పైగా నమోదైంది. ఏడు జిల్లాలలో తలసరి ఆదాయం లక్ష రూపాయలు, అంతకు మించి ఉంది. విద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది.
 
రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించిన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ వెస్ట్ మెంట్ మీట్, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, రాష్ట్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖల ఆధ్వర్యంలో 2016 జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు మంచి ఫలితాలనిచ్చింది.  రూ.4.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 50 శాతం వరకు ఆచరణలోకి వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.10.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు వచ్చాయి. 664 ఒప్పందాలు(ఎంఓయు) జరిగాయి. ఈ పెట్టుబడులు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో అధిక భాగం పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతిపానలన్నీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
 
ప్రతి ఎంఓయుకు ఒక ఎస్కార్ట్‌ అధికారి 
భాగస్వామ్య సదస్సు ద్వారా కుదిరిన ప్రతి అవగాహన ఒప్పందం వాస్తవరూపం దాల్చడానికి ఎస్కార్ట్ అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి ఎంఓయుకు ఒక ఎస్కార్ట్‌ అధికారిని నియమిస్తారు. ఆ ఒప్పందం కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకునే బాధ్యత ఆ అధికారిదే. అలాగే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున కావలసిన పనులు, ఇతర వ్యవహారాలు ఆ అధికారి చూసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఒప్పందం కార్యరూపం దాల్చేవరకు ఆ అధికారి వారి వెంటపడి పని చేయాలి. 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, ఆ స్థాయిలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ప్రత్యేక హోదా ద్వారా ఏయే ప్రయోజనాలు వస్తాయో అవన్నీ కూడా ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇస్తోంది.  ఆ ప్యాకేజీకి ఈ నెల 22న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చట్టబద్దత కల్పించే అవకాశం ఉంది. అంతే కాకుండా కేంద్రం నుంచి రావలసిన అన్ని రకాల రాయితీలను రాబడుతూ పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే ప్రత్యేక చర్యల వల్ల పెట్టుబడుల ప్రవాహం పెరిగి లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 కోట్ల అపరాధం చెల్లించకుంటే మరో 13 నెలలు జైల్లోనే...