మహిళలకు అన్ని రంగాలలో ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని జిల్లా సంయుక్త పాల నాధికారి (అభివృద్ధి) హిమాన్షు శుక్లా తెలిపారు. 8వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి ఫైర్ స్టేషన్ వరకు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలు మహిళల పేరునే ఇవ్వడం జరుగుతుందన్నారు. పురుషులు కూడా మహిళలను అన్ని రకాలుగా బలపరచాలని కోరారు. మహిళల వల్లే కరోనాపై విజయం సాధించడం జరిగిందన్నారు. మెడికల్ సిబ్బంది, డాక్టర్లు, సానిటరీ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా అంతా ఎక్కువమంది మహిళలే ఉన్నారని వారు చేసిన సేవలు వల్ల కరోనాపై విజయం సాధించడం జరిగిందని శుక్లా తెలిపారు.
మహిళలు బహుముఖమైన పాత్రలు పోషిస్తున్నారని తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఉద్యోగస్తురాలుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా సంయుక్త పాలనాధికారి- సంక్షేమం నంబురి తేజ్ భరత్ మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని అన్నారు. మహిళలు అవమానాలు, అత్యాచారాలు వంటి అనేక కష్టాలను అనుభవిస్తున్నారని వాటిని ఎదుర్కొనేందుకు మహిళలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించడంతో పాటు కొన్ని చట్టాలు తీసుకరావడం జరిగిందని తెలిపారు.
దిశ చట్టం వల్ల మహిళల రక్షణకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రాణం పోసే శక్తి ఒక స్త్రీకి, దేవుడికి మాత్రమే ఉందని ఎవరికీ లేదని ఆయన అన్నారు. స్త్రీ పాత్ర చాలా అమోఘమైదని, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి లోగోను జాయింట్ కలెక్టర్లు పరిశీలించారు. లోగో చుట్టూ కేండిల్స్‌తో ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం ఇండోర్ స్టేడియం నుండి జిల్లా పరిషత్ మీదుగా ఫైర్ స్టేషన్ వరకు కేండిల్స్ ర్యాలీ చేరుకుంది. ఫైర్ స్టేషన్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ కుమారి, డిఇఓ రేణుక, డిఎంహెచ్ఓ డాక్టర్ సునంద, ఏలూరు ఆర్డిఓ రచన, సిడిపివోలు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.