చదువు కోసం విదేశాలకు వెళ్లి తెలుగు విద్యార్థులు చేసే దురాగతాలకు అంతు లేకుండా పోతోంది. తెలుగు విద్యార్థుల ఆత్మగౌరవాన్ని పాడుచేస్తున్నారు. తోటి తెలుగు విద్యార్థులు అని కూడా చూడకుండా జూనియర్లుగా ఉన్న ఎనిమిది మందిని ర్యాగింగ్ చేసారు. ఫిర్యాదు చేయడంతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, కాకాని రోడ్డులోని సరస్వతినగర్‌కు చెందిన వేల్పుల నాగమణి, భూషణంల కుమారుడు పాల్ భూషణం ఫిలిప్పైన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కొన్ని నెలల క్రితం 8 మంది సీనియర్‌లు 8 మంది జూనియర్‌లను ర్యాగింగ్ చేసారని పాల్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో అతని తల్లి 9 నెలల క్రితం 8 మందిలో ఇద్దరైన విజయవాడకు చెందిన మధు, గిద్దలూరుకు చెందిన నిఖిల్ ఇళ్లకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే తమ పిల్లలు అలాంటి వారు కాదని వారు వాదించారు.
ఈ ఫిర్యాదు విషయం తెలుసుకున్న ఫిలిప్పైన్స్‌లోని సీనియర్‌లు పాల్‌పై దాడి చేసారు. తీవ్రంగా కొట్టారు. బాధితుడు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు హత్యా యత్నం క్రింద కేసు నమోదు చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మంది సీనియర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కేసులో రాజీ పడాలని పాల్ తల్లిదండ్రులపై ఒత్తిడి చేసారు. కానీ ఫిర్యాది రాజీ పడాలంటే ఫిలిప్పైన్స్ నియమాల ప్రకారం ప్రభుత్వానికి కొంత డబ్బు చెల్లించాలి.
ఈ కేసు విషయంలో 40 లక్షలు చెల్లించాలని పోలీసులు స్పష్టంచేశారు. ఇందులో 10 లక్షలు మాత్రమే మేము చెల్లిస్తామని, మిగతా 30 లక్షలు మీరు చెల్లించాలని సీనియర్ల తల్లిదండ్రులు బాధితుని తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. చెల్లించకపోతే అక్కడ కుమారుడిని, ఇక్కడ మిమ్మల్ని చంపేస్తామని బ్లాక్ మెయిల్ చెస్తున్నారు. ఈ విషయమై బాధితులు ఈ నెల 5వ తేదీన పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ రోజులు గడుస్తున్నా కేసు మాత్రం ముందుకు నడవడం లేదని, పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని పాల్ తల్లి నాగమణి ఆందోళన వ్యక్తం చేశారు.