Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోగ నిరోధక శక్తిని పెంచుకోండి: కోవిడ్-19 టాస్క్ ఫోర్స్

Advertiesment
రోగ నిరోధక శక్తిని పెంచుకోండి: కోవిడ్-19 టాస్క్ ఫోర్స్
, బుధవారం, 29 ఏప్రియల్ 2020 (17:14 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అ మహమ్మారి నుండి రక్షణ పొందడానికి  ప్రతి ఒక్కరూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం కోరారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు శానిటైజర్లు, మాస్క్ లతో ఎంత  జాగ్రత్తగా ఉన్నా వారి శరీరంలో రోగనిరోధక శక్తి లేనట్లయితే వారు కరోనా బారినపడే అవకాశం ఉందని అందుకే ఆయుర్వేద పద్దతుల ద్వారా మరియు ప్రకృతి సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ వారు చేసిన సలహాలు, సూచనలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆయన తెలిపారు. 

సాధారణ పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే దాహం అనిపించినపుడల్లా గోరువెచ్చని నీరు తాగాలని, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలని, రోజువారీ వంటకాల్లో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా వుండేలా చూసుకోవాలని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అదేవిధంగా ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిరోజూ ఉదయం ఒక టీ స్పూన్ చవనప్రాశ తినాలని, మధుమేహం ఉన్నవారు చక్కెర లేని చవనప్రాశ తీసుకోవాలని, తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైన వాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండు సార్లు తాగాలని, రుచి కోసం అందులో బెల్లం లేదా తాజా నిమ్మ రసం కలుపుకోవచ్చని, 150 మిల్లీ లీటర్ల పాలలో అర స్పూన్ పసుపు కలుపుకొని రోజుకు ఒకటి, రెండు సార్లు తీసుకోవాలని పేర్కొన్నారు.
 
సులభమైన ఆయుర్వేద పద్ధతుల ద్వారా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని, ఇందుకోసం నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కు రంద్రాల దగ్గర పట్టించాలని, దీన్ని ఉదయం మరియు సాయంత్రం చేయాలని తెలిపారు.

అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె నోటిలో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించిన తరువాత ఊసెయ్యాలని, ఆ తరువాత వెంటనే నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని తెలిపారు.

ఈ పనిని రోజుకు ఒకటి రెండు సార్లు చేయవచ్చన్నారు.   పొడి దగ్గు ఉంటే పుదీనా ఆకులు లేదా సోపు గింజలు కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలన్నారు. లవంగాల పొడిని బెల్లం లేదా తేనెతో కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గు, గొంతు గరగరల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు.

ఒక వేళ పొడి దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 24x7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 104 లేదా 1902కు కాల్ చేయవచ్చని సమాచార శాఖ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎగవేతదారులు మావాళ్లు కాదు:నిర్మలా సీతారామన్