కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని దేవర ఉత్సవాల్లో కలుషిత నీరు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు.
బుధవారం ఉదయం ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులందరినీ మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌లో మంగళవారం దేవర ఉత్సవాలు జరిగాయి.
ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అక్కడ తాగునీరు కలుషితం కావడంతో... ఆ నీరు తాగిన కాలనీవాసులలో 30 మందికి వాంతులు, విరోచనాలయ్యాయి. అస్వస్థతకు గురయిన వారందరినీ వెంటనే ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోగులతో ఆసుపత్రి కిటకిటలాడింది. కాగా, వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన అరుణ్ జ్యోతి నగర్‌కు చెందిన కోలుకోక రంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఏరియా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.
కుళాయిల ద్వారా రంగు నీళ్లు వచ్చాయని, ఆ నీళ్లను తాగిన వాళ్లందరికీ వికారం, వాంతులు, విరోచనాలు అయ్యాయని కాలనీవాసులు కమిషనర్ దృష్టికి తెచ్చారు.
నీటిని ల్యాబ్‌కు పంపి రిపోర్టు ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లకు సూచించారు.