పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా, దక్షిణ ఆంధ్రా, ఉత్తర తమిళనాడు రాష్ట్రాలకు మాత్రం ఈ వర్ష ముప్పు పొంచివుందని పేర్కొంది.
మరోవైపు, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో గురువారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచన చేసింది.
అదేసమయంలో రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా నెల్లూ రు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, పలు ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది.