ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ బంకులను నడిపే పలు యాజమాన్యాలు వినియోగదారులను అడ్డగోలుగా దోచుకుంటున్నట్లు తాజాగా బైటపడింది. అనంతపురంలోని ఓ పెట్రోల్ బంకులో ఏకంగా మీటరునే ట్యాంపరింగ్ చేసి పెట్టేసారు. దాని ప్రకారం మీరు రూ. 100 పెట్రోల్ కొట్టించుకుంటే రూ. 90కి మాత్రమే ఆయిల్ వస్తుంది. మిగిలిన రూ. 10 బొక్కేస్తారు. ఇలా కేవలం 11 నెలల్లో రూ.2 కోట్లు ప్రజల జేబులకు చిల్లు పెట్టి దోచుకున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బైటపడింది.
ఇటువంటి స్కాం ఇంతవరకూ రాష్ట్రంలో ఎక్కడా చూడలేదనీ, వేసిన సీల్ వేసినట్లే వుందనీ, కానీ అత్యంత చాకచక్యంగా మీటర్ బోర్డులోని చిప్ మార్చేసి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీనితో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి బంకులు 80 శాతానికి పైగానే వుంటాయనే చర్చ జరుగుతోంది. మరి మీరు కొట్టించుకునే పెట్రోల్ బంకులో కూడా ఇలాంటి మోసమే జరుగుతుందేమో చెక్ చేసుకోమంటున్నారు అధికారులు.