Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ హయాంలో అవినీతి జరిగితే, కేంద్రం నుంచి రూ.10వేలకోట్లు ఎలా తెచ్చారు?: రాజేంద్రప్రసాద్

Advertiesment
టీడీపీ హయాంలో అవినీతి జరిగితే, కేంద్రం నుంచి రూ.10వేలకోట్లు ఎలా తెచ్చారు?: రాజేంద్రప్రసాద్
, బుధవారం, 21 అక్టోబరు 2020 (20:48 IST)
రాష్ట్రప్రభుత్వ వేధింపులకు నిరసనగా, ఏపీ పంచాయతీరాజ్ అసోసియేషన్ తరుపున రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖకు చెందిన ఇంజనీర్లు కలెక్టరేట్ల ఎదుట నేడు నిరసనప్రదర్శనలు చేస్తున్నారని, 31-10-2018 నుంచి 01-05-2019 మధ్య ఎనిమిది నెలల కాలంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి అవినీతి జరిగిందని, ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా పనులుచేసిన ఇంజనీర్లను వైసీపీప్రభుత్వం దారుణంగా వేధింపులకు గురిచేస్తోందని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్ తెలిపారు.

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 26వేల కిలోమీటర్ల వరకు సిమెంట్ రోడ్లను టీడీపీ హాయాంలో రూ.25వేలకోట్లతో వేయడం జరిగిందని, అందులో కేవలం రూ.12వేల పనులకు సంబంధించి మాత్రమే తనిఖీలు జరిపి, రూ.180కోట్లు మాత్రమే దుర్వినియోగం అయినట్లుగుర్తించడం జరిగిందన్నారు.

దాన్ని సాకుగా చూపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లపై విజిలెన్స్ విచారణ జరపాలని, ప్రభుత్వం మెమో ఇవ్వడం జరిగిందన్నారు.  రూ.26వేలకోట్ల పనులు జరిగినప్పుడు ఎక్కడో ఒకచోట చిన్నచిన్న తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చుగానీ, ప్రభుత్వం మాత్రం చివరకు ఏమీ తేల్చలేకపోయిందన్నారు.

టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఉపాధిహామీ పనులకు సంబంధించి, ఎలాంటి తప్పులు , అవినీతిని కనుక్కోలేకపోయామనే అక్కసు, దుగ్ధతోనే  జగన్  ప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లను వేధింపులకు గురిచేస్తోందని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ దుర్మార్గాన్ని టీడీపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇంజనీర్ల ఆందోళనకు తాము పూర్తిగా మద్ధతునిస్తున్నామన్నారు.  

అక్టోబర్ 1, 2018నుంచి మే 31 – 2019 వరకు రావాల్సిన రూ.2,500కోట్లను జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని, పనులుజరిగి రెండేళ్లు అవుతున్నా, కాంట్రాక్టులు తీసుకొని పనులుచేయించినవారు నానా అవస్థలు పడుతున్నారన్నారు.

ఉపాధిహామీ పథకం కింద అభివృద్ధి పనులు చేయించినవారిలో అధికంగా 60శాతంవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని, ఆయావర్గాలకు చెందిన ఆనాటిప్రజాప్రతినిధులపై జగన్ ప్రభుత్వం కావాలనే కక్షసాధిస్తోందన్నారు. కేంద్రం తనవాటాగా చెల్లించాల్సిన రూ.1800కోట్లను చెల్లించినాకూడా, రాష్ట్రప్రభుత్వం మాత్రం సదరు నిధులను సొంతఅవసరాలకు వాడుకుందన్నారు.

ఆ సొమ్ము చెల్లించకుండా కుంటిసాకులు చెబుతున్న జగన్ ప్రభుత్వం,  అవేపనులకు సంబంధించి కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చి, ఈ రెండేళ్లకాలంలో రూ.10వేలకోట్లను ఎలా తెచ్చుకుందో సమాధానం చెప్పాలన్నారు. కేంద్రానికి యూ.సీ.లు ఇచ్చేటప్పుడు ఉపాధిహామీ పనులు బాగాజరిగాయని చెప్పిన జగన్ ప్రభుత్వం, రాష్ట్రంలో మాత్రం కూలీలను,  కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను వేధించడం కక్షసాధింపు ధోరణి కాక మరేమవుతుందో చెప్పాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.

అవినీతి జరగడం నిజమో, పనులు బాగా జరగడం నిజమో రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జరుగుతున్న వ్యవహారంపై తాము కోర్టులనుకూడా ఆశ్రయించామని, కరోనా కారణంగా విచారణలో జాప్యం జరుగుతోందన్నారు. తమ ప్రభుత్వంలో జరిగే ఉపాధి హామీ పనులు తూతూమంత్రంగా జరుగుతున్నాయని మంత్రి ధర్మాన కృష్ణదాసే చెప్పాడని, వైసీపీప్రభుత్వంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులపై కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు.

ఉపాధి హామీ పనికివెళ్లేవారంతా పూటగడవని కూలీలేనని, వారిలో పేదలే అధికంగా ఉంటారనే నిజాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గ్రహిస్తే మంచిదన్నారు. పేదకూలీలను కించపరిచేలా, అవమానించేలా మంత్రి మాట్లాడటాన్ని తాముతీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన తనవ్యాఖ్యలతో దాదాపు కోటిమంది ఉపాధిహామీ కూలీలను దారుణంగా అవమానించాడన్నారు.

మంత్రి తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఉపాధిహామీ కూలీలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వై.వీ.బీ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రే, తమప్రభుత్వంలో ఉపాధి హామీపనుల్లో అవినీతి జరుగుతుందని, అలానే రెండుగంటలు, మూడు గంటలుకాలక్షేపం చేసి, ఉపాధిహామీ కూలీలు డబ్బుతీసుకుంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తక్షణమే తనవైఖరేమిటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీన్ రివర్స్... రూ.7.20 లక్షలు కొట్టేసింది.. పెళ్లి చేసుకుని జంప్