నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల సహకారంతో కరోనా బాధితుల కోసం మందును పంపిణీ చేస్తానని, అయితే మందు పంపిణీ ఇపుడే చేపట్టబోనని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు.
ఆయన మందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ ఉన్నవారెవరూ మందుకోసం రావద్దని కోరారు. అధికారుల సహకారంతో మందును ఎక్కడికక్కడ పంపిణీ చేస్తామని తెలిపారు.
మూడు రోజుల్లో ప్రభుత్వ అధికారులతో తమ కుటుంబసభ్యులు చర్చిస్తారని... ఆ తర్వాత, మందును ఎప్పటి నుంచి పంపిణీ చేస్తాననే విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. తనను పోలీసులు నిర్బంధించలేదని... తనకు రక్షణ కల్పించారని ఆనందయ్య తెలిపారు.
పేదవారికి కూడా తాను మందును అందించానని... ఇప్పటి వరకు 50 వేల మందికి మందును ఇచ్చానని చెప్పారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందును అందిస్తామని... ఆ తర్వాత ఇతరులకు పంపిణీ చేస్తామని తెలిపారు. మరోవైపు, మందు తయారీకి కావాల్సిన వనమూలికలను ఆయన శిష్యగణం సిద్ధం చేస్తున్నారు.
కాగా, ఎందరో కరోనా వ్యాధిగ్రస్తుల పాలిట ఆనందయ్య ఆపద్బాంధవుడిగా మారిన విషయం తెల్సిందే.ఆయన తయారు చేస్తున్న నాటు మందు కోసం సామాన్యులే కాకుండా... వీవీఐపీలు సైతం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు ఆయన చేత మందు తయారు చేయించుకుని... వారి ఇళ్లకు తీసుకెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది.