సుప్రీంకోర్టుకు కాకపోతే ఇంకో కోర్టుకు పోండి, నన్నేం పీకలేరన్న చంద్రబాబు
ఓటుకు కోట్లు కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని హైకోర్టు చెప్పినా వినకుండా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇలాంటి కేసులు నన్నేమీ చేయలేవు అంటూ చంద్రబాబు మాట్లాడటంతో ఏపీ శాసనసభలో గందరగోళం నెలకొంది.
అసెంబ్లీ సాక్షిగా తనపై పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. గత రెండు రోజులుగా వైఎస్ జగన్‌తో సహా వైకాపా ఎమ్మెల్యేలు తనపై ఓటుకు కోట్లు కేసు విషయమై విమర్శలు గుప్పిస్తూ ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబు సహనం కోల్పోయారు. ఓటుకు కోట్లు కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని హైకోర్టు చెప్పినా వినకుండా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇలాంటి కేసులు నన్నేమీ చేయలేవు అంటూ చంద్రబాబు మాట్లాడటంతో ఏపీ శాసనసభలో గందరగోళం నెలకొంది.
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు? ‘‘ప్రతిపక్ష సభ్యులు శాసనసభలో ఒకే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశంపై హైకోర్టుకు వెళ్లారు.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ చట్టం(అవినీతి నిరోధక చట్టం) దానికి(ఓటుకు కోట్లు కేసు) వర్తించదని హైకోర్టు చెప్పింది. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అది కేసే కాదు.. కేసులు నన్నేమీ చేయలేవు’’ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
సభలో పరోక్షంగా ఓటుకు నోట్లు కేసును ప్రస్తావించడంలో కూడా చంద్రబాబు ఎంత నేర్పరితనం ప్రదర్శించారంటే ఆ కేసు పేరెత్తకుండానే అది కేసే కాదని చెప్పేశారు. ఇలాంటి కేసులు నన్నేం చేయలేవని సవాలు చేయడంలో కూడా ఇలాంటివి ఎన్ని ఎదుర్కోలేదు ఇది ఒక లెక్కా అంటూ చంద్రబాబు మాట్లాడటం ఆయన ఆత్మవిశ్వాసమో, అతి విశ్వాసమో తెలియడం లేదు.