కరోనా కాలం. ఆస్పత్రికి వెళ్లాలంటే జనం జడుసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ భయంతో వైద్యుల వద్దకు వెళ్లేందుకు భయపడిన ఓ గర్భవతికి కార్డియాక్ అటాక్ వచ్చింది. కోవిడ్ భయం కారణంగా వైద్యుల వద్దకు వచ్చేందుకు జనాలు జడుసుకుంటున్నారని.. దీంతో సమస్యలు పెద్దదవుతూ.. మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు. ఇలా కార్డియాక్ అరెస్ట్‌తో నానా తంటాలు పడిన గర్భవతిని, బిడ్డను వైద్యులు కాపాడారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రి అత్యవసర ట్రామా సర్వీసుల విభాగాధిపతి డాక్టర్ పాటిబండ్ల సౌజన్య మాట్లాడుతూ.. కర్ణాటక, బీదర్ జిల్లాకు చెందిన మహిళ గర్భవతి. కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆమెను కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
పరీక్షించిన వైద్యులు రక్తపోటు, ప్లేట్‌లేట్ల సంఖ్య తగ్గడం, ఊపిరితిత్తులో నీరు చేరిందని గుర్తించారు. ఆమెకు `అత్యవసర విభాగంలో శ్వాస అందించి రీససికేషన్ ప్రక్రియ నిర్వహించామని సౌజన్య తెలిపారు.
నెలలు నిండని బిడ్డను బయటకు తీసేందుకు సిజేరియన్ చేశామని, ప్రసవం తర్వాత తల్లి మరోసారి కార్డియాక్ అరెస్టు అయిందని పేర్కొన్నారు. నిపుణుల సహాయంతో ఆమెకు అత్యుత్తమ వైద్యం అందించడంతో తల్లీబిడ్డ కోలుకోవడంతో డిశ్చార్జి చేశామన్నారు.