Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ నిర్ణయంతో హైదరాబాద్ కే లాభం!

Advertiesment
Hyderabad
, బుధవారం, 18 డిశెంబరు 2019 (06:21 IST)
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన హైదరాబాద్ కు లాభం చేకూర్చి పెట్టనుంది. ఆయన నిర్ణయం కార్యరూపం దాల్చితే.. ఇప్పటి వరకూ నష్టాల్లో వున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పుంజుకోవడంతో ఖాయంగా కనిపిస్తోంది.

అమరావతిపై జగన్‌ సర్కార్‌ నీళ్లు చల్లడంతో ఇప్పుడు రియల్టర్లు, వ్యాపారవేత్తల చూపు మళ్లీ హైదరాబాద్‌పై పడనుంది. ఆర్థిక మాంద్యంతో ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఇకనుంచి వేగంగా పుంజుకోనుంది. ఏపీలో రాజధాని అనిశ్చితి నేపథ్యంలో హైదరాబాద్‌ అయితే సేఫ్‌ అనే అభిప్రాయంతో రియల్టర్లు ఉన్నారు.

దేశ, విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమని, అలాంటి అభివృద్ధి ఏపీలోని 3 రాజధానుల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్‌ సుస్థిర రాజధానిగా ఉండడంతో ఏ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా మంచి ఫలితాలే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
 
ఏపీ రాజధానిపై స్పష్టత రావడంతో రియల్టర్లు, వ్యాపారుల దృష్టి మళ్లీ హైదరాబాద్‌పై పడింది. నిజానికి, రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్నాళ్లపాటు స్తబ్ధత నెలకొంది. అనేకమంది అమరావతిపై దృష్టిపెట్టారు.

ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి చుట్టుపక్కల అభివృద్ధికి కొన్ని ప్రణాళికలు అమలు చేయడంతో హైదరాబాద్‌ నుంచి కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్కడకు వెళ్లి భూములు కొని వెంచర్లు, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు ఆగిపోయాయి. తాజాగా జగన్‌ ప్రకటన తర్వాత అక్కడ పెట్టుబడి పెట్టిన రియల్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పెట్టుబడులు పెట్టిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. భవిష్యత్తులో ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాల్లేవు. ఒకవేళ విశాఖలో పెట్టుబడులు పెడితే వచ్చే ఎన్నికల తర్వాత వేరే ప్రభుత్వం వస్తే తమ పరిస్థితి ఏమిటని కొందరు రియల్టర్లు ఆందోళనలో ఉన్నారు. దాంతో, ఇప్పుడు ఎక్కువమంది చూపు మళ్లీ హైదరాబాద్‌పైనే పడింది.
 
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌ వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. ఏపీకి కలిగే లాభనష్టాల విషయాన్ని పక్కన పెడితే, ఆ రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటైతే, హైదరాబాద్‌కు మేలని రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా అభిప్రాయపడుతున్నారు. కుల రాజకీయాల వల్లనే జగన్‌ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని టీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు విశ్లేషించారు.

కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీసే ఉద్దేశం దీని వెనక దాగి ఉంటుందని, అమరావతిలో భూముల ధరలు పడిపోవటం ఖాయమని అభిప్రాయపడ్డారు. జగన్‌ నిర్ణయంతో హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందటం ఖాయమని ప్రభుత్వ ముఖ్యుడొకరు చెప్పారు. ‘‘ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ నుంచి అమరావతికి పెట్టుబడులు తరలించుకొని వెళ్లటానికి గట్టిగా ప్రయత్నించారు.

అయినా, చాలామంది సీనియర్‌ వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు వెళ్లలేదు. ఇప్పుడు జగన్‌ నిర్ణయంతో కొత్త పెట్టుబడిదారులు కూడా అటు వైపు వెళ్లకపోవచ్చు. పూర్తిగా హైదరాబాద్‌ వైపే వస్తారు’’ అని కీలకమైన నామినేటెడ్‌ పదవిలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేత ఒకరు విశ్లేషించారు. ఏపీలో 3 రాజధానుల నిర్ణయం అమలైతే, హైదరాబాద్‌లో ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు, భూముల ధరలు పెరుగుతాయని కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కొందరు అంచనా వేస్తున్నారు.

ఏపీకి రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించడంతో ఇప్పుడిప్పుడే అక్కడి ప్రజలకు ఏర్పడుతున్న నమ్మకం, జగన్‌ తాజా ప్రకటనతో సన్నగిల్లే ప్రమాదం ఉందని బీజేపీ తెలంగాణ నేత ఒకరు విశ్లేషించారు. తెలంగాణలో శాంతి భద్రతల నిర్వహణ బాగుండటం, ఇక్కడి సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడం, ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో వారంతా ఇక్కడే తమ వ్యాపార, వాణిజ్యాలను విస్తరించటానికి మొగ్గు చూపుతారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని ఉంటే.. ఉన్నతాధికారులు అత్యధికులు హైదరాబాద్‌ నుంచి విమానాల్లో అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తారని అంచనా వేస్తున్నారు. కర్నూలులో జ్యుడిషియల్‌ కేపిటల్‌ ఏర్పడితే, న్యాయవాదులు హైదరాబాద్‌లో ఉండటానికి మొగ్గు చూపవచ్చని చెబుతున్నారు. వారు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ద్వారా కర్నూలుకు వెళ్లటం తేలిక అవుతుందని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక రాజధానికే దిక్కు లేదు: పవన్ సెటైర్లు