రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా మొబైల్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపవద్దంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తూ అటువంటి నిబంధనలతోపాటు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానా విధిస్తూండటం తరచూ చూస్తునే ఉంటాం. ఇటీవల కాలంలో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కొద్దిరోజుల పాటు జైలుశిక్ష కూడా విధిస్తున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఓ యువకుడికి కోర్టు ఏకంగా నాలుగు రోజుల జైలుశిక్ష విధించడం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. అయితే ఈ తీర్పుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శిక్షని రద్దు చేయడం గమనార్హం.
వివరాలలోకి వెళ్తే... వి.భరద్వాజ అనే యువకుడు మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని అతడిని సైబరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అతడిని విచారించిన జడ్జి అతనికి నాలుగు రోజుల జైలుశిక్ష విధించారు.
అయితే భరద్వాజ మేనమామ, మంగళవారంనాడు క్రింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి భరద్వాజ నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదన్న విషయాన్ని అయినా క్రింది కోర్టు పరిగణనలోకి తీసుకొని జరిమానా విధించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.
జైలుకు వెళ్లి వచ్చిన వారిని సమాజం ఎలా చూస్తుందో ఊహించి ఉండాల్సిందనీ, కుటుంబ స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలనీ, న్యాయాధికారులు దోషులుగా ఒక్క రోజు జైలులో ఉండి వస్తే ఆ బాధ ఏమిటో తెలుస్తుందనీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేసిన ధర్మాసనం అధికారం ఉందని ఇలా దుర్వినియోగానికి పాల్పడకూడదని హెచ్చరించింది. ఓ తీర్పు వెలువరించే ముందు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని తాము మాటిమాటికీ చెబుతూనే ఉన్నప్పటికీ న్యాయమూర్తులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.