సిరుల తల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 10వ తేదీన మంగళవారం ఆన్ లైన్ విధానంలో లక్ష కుంకుమార్చన ఏకాంతంగా నిర్వహించనుంది టిటిడి.
భక్తులు తమ నివాస ప్రాంతాల నుంచి ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనుంది. అయితే లక్ష కుంకుమార్చన టిక్కెట్లు నవంబరు 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ కార్యక్రమం నవంబరు 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది టిటిడి. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, రెండు పసుపు దారాలు, కలకండ ప్రసాదంగా తపాలా శాఖ ద్వారా గృహస్తుల చిరునామాకు పంపించనున్నారు.
టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే.. ముందుగా tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్‌కు లాగిన్ అవ్వాలి. ఆ తరువాత ఆన్ లైన్ లక్ష కుంకుమార్చన అనే బటన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ ఐ అగ్రీ అనే బాక్స్‌లో టిక్ గుర్తు పెట్టాలి.
ఆ తరువాత గృహస్తుల పేర్లు, వయస్సు, లింగం, గోత్రం, మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ప్రసాదాల పంపిణీ కోసం చిరునామా వివరాలు కూడా పొందుపరిచాలి. ఈ సమాచారాన్ని సరిచూసుకుని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజీ వస్తుంది.
ఏదైనా బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆ టిక్కెట్టు మొత్తాన్ని చెల్లించాలి. పేమెంట్ పూర్తయిన తరువాత టిక్కెట్ ఖరారవుతుంది. గతంలో ఆస్థానమండపంలో లక్ష కుంకుమార్చనను నిర్వహించేవారు. అయితే కోవిడ్ కారణంగా ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది టిటిడి.