తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే సూచలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాగల 36 గంటల వ్యవధిలో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని, కొన్ని చోట్ల మరింత వర్షం పడుతుందని పేర్కొంది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం నెలకొని వుందని, ఇదేసమయంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింతగా బలపడి వాయవ్య దిశగా సాగుతుందని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు కమ్ముకొస్తాయని, పర్యవసానంగా భారీ వర్షం పడుతుందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు, కోస్తాంధ్రకు ముప్పు అధికమని అన్నారు.
ఇదిలావుంటే, కృష్ణానదిలో భారీ వరద ప్రవహిస్తూ ఉండటంతో, ఈ సీజన్‌లో మరోసారి నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి 1.61 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు వస్తుండటం, ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తిగా నిండిపోవడంతో 20 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
సోమవారం సాయంత్రానికి వరద మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీరంతా పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. ప్రస్తుతం సాగర్ లో 309.35 టీఎంసీల నీరుందని, 590 అడుగుల నీటిమట్టానికిగాను 589.10 అడుగుల వరకూ నీరుందని అధికారులు వెల్లడించారు.
ఇక, శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి, 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. అన్ని ఎత్తిపోతల పథకాలకూ పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నారు. జలాశయంలో 215 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉండగా, ప్రస్తుతం 211 టీఎంసీల నీరు నిల్వ వుంచారు.