బెజవాడ దుర్గుగుడి ఎదుట ఓ పోలీసు అధికారి అర్థనగ్నప్రదర్శనకు దిగాడు. ఈ చర్య స్థానికంగా కలకలం సృష్టించింది. తన తప్పు లేకపోయినా మందలించారన్న మనస్తాపంతో ఓ పోలీసు అధికారి ఈ చర్యకు పాల్పడ్డారు. దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, సోమవారం రాత్రి 10:30-11 గంటల మధ్య విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద పోలీసు అధికారి అర్థనగ్నన ప్రదర్శనకు దిగారు.
ఆయన అలా చేయడానికి గల కారణాలను పరిశీలిస్తే, ఏ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు. దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించారు.
అయితే, తాను ఎటువంటి తప్పూ చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తామంటూ పై అధికారులు మండిపడ్డారని సదరు పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, తీవ్ర మనస్తాపంతో చొక్కా విప్పి నిరసన తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ అది నిరసన కాదని, అతడు ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం.