గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా కార్యకర్తల దౌర్జన్యకాండ రెండోరోజైన బుధవారం కూడా కొనసాగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామిషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనీకుండా భౌతికదాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ముఖ్యంగా మంగళవారం మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు.
టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందనే వార్తలతో... వాకబు చేసేందుకు వీరు మాచర్లకు వచ్చారు. ఈ సందర్భంలో వారిపై దాడి జరిగింది. పెద్ద కర్రతో ఓ వ్యక్తి కారు అద్దాలను పగలగొట్టాడు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా వారి వాహనాన్ని వెంటాడే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. వారి శరీరం నుంచి రక్తం కారింది. ఈ ఘటనతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.