గుంటూరు రూరల్ జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించిన బిట్రా శ్రీజ్యోతి(20) హత్య కేసులోని మిస్టరీ వీడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నేతికుంట్ల సత్యనారాయణ(40)ను పోలీసులు అరెస్టు చేశారు. వయసులో తనకంటే 20 యేళ్లు చిన్నదైనా శ్రీజ్యోతిపై కన్నేశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. చివరకు ఆమె నో చెప్పడంతో పాశవికంగా హత్యచేశాడు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివశిస్తున్న మృతురాలు శ్రీజ్యోతి కుటుంబానికి సన్నిహితుడైన నేతికుంట్ల సత్యనారాయణ కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతను శ్రీజ్యోతిని వివాహం చేసుకోవాలని భావించాడు.
ఇదే విషయాన్ని రెండుసార్లు శ్రీజ్యోతి వద్ద ప్రస్తావించగా ఆమె మందలించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21వ తేదీన వివాహ సంబంధం మాట్లాడుకునేందుకు ఏలూరు వెళ్లిన యువతి తల్లిదండ్రులకు వరుడునచ్చడంతో, సంబంధం దాదాపు ఖరారైనట్టేనని తండ్రి సుధాకర్ తనకు మిత్రుడైన సత్యనారాయణకు చెప్పాడు.
తాను వివాహం చేసుకుందామనుకున్న యువతి తనకుదక్కకుండా పోతుందని కక్ష కట్టిన సత్యనారాయణ.. శ్రీజ్యోతి ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న ఆమెపై చాకుతో దాడి చేశాడు. గొంతులో పలుమార్లు పొడిచి హత్య చేసి, ఏమీ తెలియనట్టుగా వేద టాకీస్ పక్క సందులోని అతని మామయ్య ఇంట్లోకి వెళ్లిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బహిర్గతమైంది. దీంతో నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు.