Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ

టీడీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ
, మంగళవారం, 19 అక్టోబరు 2021 (08:31 IST)
తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి, మాజీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కుమారుడు, టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న హరికృష్ణ కూడా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. టీడీపీ తమను ఎంతగానో గౌరవించిందన్నారు. అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని, పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్‌లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1985లో తొలిసారి వేపంజేరి (జీడీ నెల్లూరు) నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1989, 1999, 2004లో విజయం సాధించారు.
 
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కుతూహలమ్మ పనిచేశారు. 2007లో ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో తిరిగి కాంగ్రెస్ తరపున జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతరం 2014లో టీడీపీలో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన మైనర్ బాలిక