Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపా మంత్రులకు రక్షణపై నమ్మకం లేదట!... గన్ లైసెన్స్ కావాలంటూ మంత్రి దరఖాస్తు

gudivada amarnath
, మంగళవారం, 27 జూన్ 2023 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోంది. ఈ ప్రభుత్వంపై సీఎం జగన్ మంత్రివర్గంలో పని చేసే మంత్రులకు తమ వ్యక్తిగత రక్షణపై నమ్మకం లేకుండా పోయింది. దీంతో తమకు గన్ లైసెన్స్ కావాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇలా చేయడానికి బలమైన కారణం లేకపోలేదు. సాక్షాత్తూ విశాఖపట్టణం వైకాపా ఎంపీ కుటుంబ సభ్యులే ఇటీవల కిడ్నాప్‌కు గురయ్యారు. వీరంతా ఏకంగా 48 గంటల పాటు కిడ్నాపర్ల చెరలో ప్రాణభీతితో  బిక్కుబిక్కుమంటూ గడిపారు. 
 
వైకాపా ప్రభుత్వ పాలనపై వైకాపా ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండాపోతే ఇక సాధారణ పౌరులకు దిక్కెవరంటూ చర్చ సాగుతోంది. పైగా, ఈ కిడ్నాప్ అంశం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో పలువురు వైకాపా నేతలు తమ వ్యక్తిగత రక్షణ కోసం తుపాకీలు కావాలంటూ దరఖాస్తులు చేసుకునేందుకు క్యూకడుతున్నారు. గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీకి, ఆయన కుమారుడు శరత్ చౌదరికి ఏకంగా పోలీసులే సూచించారు. దీంతో వారిద్దరూ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
మరోవైపు, ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు వైకాపా నేతలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం విశాఖలో 600 మందికి గన్‌‍లైసెన్స్ ఉంది. వీరిలో 400 మంది వరకు మాజీ సైనికోద్యోగులు. వీరిలో ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మరో 200 మంది వరకు రాజకీయ, వ్యాపార ప్రముఖులకు లైసెన్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
కొండలు - గుట్టలకు గుండు కొట్టేస్తున్నారు.. ఎక్కడ?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు చెందిన మట్టి మాఫియా రెచ్చిపోతోందని రాష్ట్ర ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా కొండలు, గుట్టలకు గుండు కొట్టేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారంటూ వారు మండిపడుతున్నారు. ఈ అరాచకం అటు విశాఖ నుంచి ఇటు అనంతపురం వరకు సాగుతోందని, ఈ క్రమంలో వారి కంటికి కనిపించే ఏ కొండనూ వైకాపా నాయకులు వదలిపెట్టడం లేదంటున్నారు. 
 
దీనికి తాజా ఉదాహరణే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోవడమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వేస్తున్నారు. పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వడంతో కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి పరిధిలోని గుట్టను తవ్వి ఎర్రమట్టిని కొల్లగొడుతున్నారు. 
 
స్థానిక వైకాపా నాయకుడొకరు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి రోజూ వందలాది టిప్పర్లతో ప్రైవేట్‌ లేఅవుట్లకు విక్రయిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో కొద్దిరోజులకే గుట్ట కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ నాయకుడు ఇంతటితో ఆగలేదు.. మట్టి తరలించగా చదునైన ప్రాంతంలో మామిడి చెట్లు పెంచినట్లు రికార్డులో చూపి ఉపాధి నిధులు కాజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్గమధ్యంలో విమానం ఉండగా సీట్లోనే మలమూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడు